-వాంబేకాలనీ అత్యాచార ఘటన బాధాకరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాంబేకాలనీ అత్యాచార ఘటన బాధాకరమని.. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎల్బీఎస్ నగర్లోని కమ్యూనిటీ హాల్ నందు 61, 62 డివిజన్ల వాలంటీర్లకు నిర్వహించిన ‘సేవా పురస్కారాల ప్రదానోత్సవ’ వేడుకలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, ఉమ్మడి రమాదేవిలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన 143 మంది వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. సచివాలయ వ్యవస్థతో పరిపాలనలో మంచి వాతావరణం ఏర్పడటంతో పాటు.. ఒక నూతం శకం మొదలైందని మల్లాది విష్ణు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను పార్టీపరంగా నియమించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడే ఆలోచన చేసినట్లు వివరించారు. కానీ ఆ ఆలోచన ఆచరణలోకి రాలేదని.. మరలా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తాను అనుకున్నట్లు దేశానికే స్ఫూర్తిదాయకమైన ఒక వ్యవస్థను నెలకొల్పారన్నారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఆగస్ట్ 15, 2019న వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టి.. 2 లక్షల 66వేల 92 మంది వాలంటీర్లను నియమించారన్నారు.
పచ్చ గ్యాంగ్ కు చంద్రబాబు ఫోబియా ముదిరిందని మల్లాది విష్ణు విమర్శించారు. ఆయన ఒక కిలోమీటర్ నడిస్తే, అదేదో వెయ్యి కిలోమీటర్లు నడిచినట్లు డబ్బాలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరిట అవినీతి వ్యవస్థను ఏర్పాటు చేసి.. ప్రజలను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు. భర్తతో కలిసి ఉండగానే విడిపోయినట్లు చూపి.. ఒంటరి మహిళ పెన్షన్లలో జన్మభూమి కమిటీ సభ్యులు భారీ అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. కానీ ఈ ప్రభుత్వంలో కేవలం మూడేళ్లలోనే నియోజకవర్గంలో లక్షా 70 వేల మంది లబ్ధిదారులకు రూ. 113 కోట్ల సంక్షేమాన్ని పారదర్శకంగా అందించడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాలకు అందని అర్హులకు కూడా నెల రోజుల పాటు వెసులుబాటు కల్పించడమే కాకుండా.. వారందరికీ ఇటీవల అకౌంట్లలో డబ్బులు జమ చేసిన ఘనత జగనన్న ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇందుకు కృషి చేసిన సచివాలయ వ్యవస్థను, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పనిచేయాలని సూచించారు. శానిటేషన్ సెక్రటరీలు క్షేతస్థాయిలో పర్యటించి ప్రతిరోజు వారి పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. సచివాలయ మహిళ పోలీసులు కూడా స్కూల్స్, కాలేజీలను సందర్శిస్తుండాలని.. విద్యార్థినులు ఏమైనా కంప్లైంట్ చేస్తే స్వీకరించి తక్షణమే యాక్షన్ తీసుకోవాలన్నారు. అలాగే తమ క్లస్టర్ పరిధిలోని మహిళలు, యువతులతో దిశ యాప్ పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఆకతాయిల ఆగడాలతో పడుతున్న ఇబ్బందులను తల్లిదండ్రులతో చెప్పుకోలేని యువతులు, విద్యార్థినులు.. మహిళ పోలీసులకు పంచుకునేలా ఫ్రెండ్లీ వ్యవస్థ ఏర్పడాలన్నారు.
అనంతరం మల్లాది విష్ణు విలేకర్లతో మాట్లాడారు. వాంబేకాలనీ అత్యాచార ఘటన ఎంతగానో కలిచివేసిందన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మానవతా కోణంలో ఆలోచించవలసింది పోయి.. టీడీపీ, వామపక్ష నేతలు నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని.. నిందితులను దిశ చట్టం ప్రకారం కఠినంగా శిక్షించడం జరుగుతుందని వెల్లడించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం 61వ డివిజన్ కు సంబంధించి 72 మందికి సేవామిత్ర, 62వ డివిజన్ కు సంబంధించి 71 మందికి సేవామిత్ర అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, జోనల్ కమిషనర్ రాజు, నాయకులు అలంపూర్ విజయ్, ఉమ్మడి వెంకట్రావు, రామిరెడ్డి, మస్తాన్, రాజారెడ్డి, హైమావతి, రమేష్, ఖాదర్ బి, భవానీ, రాధా, శ్రీను, వెంకట్, ఆర్.ఎస్.నాయుడు, కోటేశ్వరరావు, ప్రసాద్ రెడ్డి, మీసాల సత్యనారాయణ, యోహాన్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.