-ఎండల పట్ల అప్రమత్తత అవసరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎండ తీవ్రతల దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. బీసెంట్ రోడ్డులో వైఎస్.ఆర్.టి.యు.సి. హాకర్స్ యూనియన్ సభ్యులు మల్లాది వేంకట సుబ్బారావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎండ తీవ్రత నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆరుబయట పనిచేసే కార్మికులు శరీరంలో నీటి సమతుల్యత కాపాడుకునే ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, నాయకులు వెన్నం రత్నారావు, చల్లా సుధాకర్, నాడార్స్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.