Breaking News

సీడ్ బాల్స్…

నేటి పత్రిక ప్రజావార్త :

మొక్కలు సృష్టించి, పెంచడంలో చాలా పద్ధతులు ఉన్నాయి. బయట నర్సరీ నుండి కొనుక్కుని వచ్చి మన ఇంట్లో, మన చుట్టూ పరిసరాలలో కొన్ని మొక్కలు నాటడం ఒక పద్దతి. విత్తనాలు కొనుక్కుని వచ్చి అవి చల్లాక వచ్చే మొక్కలు తీసి వేరే చోట పాతి ఆ మొక్కలు పెంచడం ఇంకో పద్దతి. మన ఇంట్లో రోజూ వాడే కూరగాయలు, పండ్లు ద్వారా వచ్చే విత్తనాలతో మొక్కలు సృష్టించడం మరో పద్దతి. ఈ పద్ధతులు కేవలం మన ఇంట్లో లేదా మనకి దగ్గరలో ఉన్న పరిసరాలలో మొక్కలు పెంచడానికి ఉపయోగపడతాయి. కానీ మనం ఇంట్లో రోజూ పారవేసే ప్రతి విత్తనంతో ఒక అడవి సృష్టించాలి అంటే వీలవుతుందా? ఖాళీ ప్రదేశాలలో, మనం చేస్తున్న ప్రయాణంలో ఎక్కడ వీలైతే అక్కడ ఈ విత్తనాలు చల్లుకుంటూ అడివిని సృష్టించడం సాధ్యమేనా…సీడ్ బాల్స్ (విత్తన బంతులు) అనే ప్రక్రియతో ఇది సాధ్యపడుతుంది. ఈ మధ్య కాలంలో ప్రకృతి ప్రేమికులు, స్వచ్చంద సేవా సంస్థలు ఈ సీడ్ బాల్స్ చల్లడాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారు.

చరిత్ర

విత్తన బంతులను “సీడ్ బాల్స్” లేదా “ఎర్త్ బాల్స్” అని కూడా పిలుస్తారు. విత్తన బంతులను సృష్టించే సాంకేతికతను జపనీస్ సహజ వ్యవసాయ మార్గదర్శకుడు “మసనోబు ఫుకుయోకా” కనుగొన్నారు. పురాతన ఈజిప్టులో ప్రతి సంవత్సరం నైలు నదికి వచ్చే వరద తరువాత పొలాలను మరమ్మతు చేయడానికి ఈ సాంకేతికత ఉపయోగించబడింది. ఆధునిక కాలంలో, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో, ప్రభుత్వ ప్రయోగశాలలో పనిచేస్తున్న ఈ జపాన్ ప్రభుత్వ మొక్కల శాస్త్రవేత్త ఫుకుయోకా పర్వత ద్వీపమైన షికోకులో నివసించి , ఆహార ఉత్పత్తిని పెంచే ఈ విత్తన బంతుల విధానం కనుగొన్నారు. సాంప్రదాయ బియ్యం ఈ విత్తన బంతుల ద్వారా జపాన్ యొక్క అగ్నిపర్వత సంపన్న నేలల్లో పండించారు.

తయారీ విధానం

ముందుగా మనం తినే పండ్లు కూరగాయల నుండి వచ్చే విత్తనాలను సేకరించి ఎండబెట్టి దాచిపెట్టాలి.
వర్షాకాలానికి ముందే ఈ సీడ్ బాల్స్ తయారు చేసుకోవాలి. మనకు అందుబాటులో ఉన్న మట్టిలో కొంచెం మంచి మట్టి తీసుకొవాలి. అందులో పేడ నుండి తయారైన ఎరువు 40శాతం కలపాలి.
ఎరువు కలపకుండా కేవలం బంక మట్టి లేదా ఎర్ర మట్టితో కూడా వీటిని చేయవచ్చు.ఈ మిశ్రమానికి నీళ్ళు కలిపి ముద్దగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ముద్దగా చేసిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని అందులో ఒకటి లేక రెండు విత్తనాలు పెట్టి విత్తనం కనిపించకుండా గుండ్రంగా చేయాలి. తడిగా ఉన్న ఈ బాల్స్ పొడిగా అయ్యేవరకు రెండు రోజలు ఆరబెడితే చాలు… సీడ్ బాల్స్ రెడీ…పువ్వులు, పండ్లు, కూరగాయలు ఏ విత్తనాలతో అయినా ఈ సీడ్ బాల్స్ తయారు చేయవచ్చు. వర్షాకాలంలో ఈ సీడ్ బాల్స్ ను మనకు వీలైన చోట్లలో రహదారుల వెంట, రోడ్లు వెంట, బీడు భూముల్లో, ఖాళీ స్థలాలలో, కొండలపై, మరియు అడవుల్లో చల్లినట్లైతే మన వంతుగా ప్రకృతికి, భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేసినవాళ్లము అవుతాము. ఈ వేసవిలో కొన్ని బాల్స్ తయారు చేసుకుని వర్షాకాలంలో వర్షాలు మొదలు అయ్యాక కనీసం మన ఊరిలో, మన ఇంటి చుట్టూ కనిపించే ఖాళీ ప్రదేశాల్లో అయినా కొన్ని మొక్కలు సృష్టించి, వృక్షాలు పెంచగలమేమో.. ప్రయత్నించి చూడండి.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *