-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 12 లక్షల విలువైన యూజిడి పనులకు శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 61వ డివిజన్ వాంబేకాలనీ హెచ్ 3 బ్లాక్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావుతో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పోతూపోతూ నగరంలో పెద్దఎత్తున సమస్యలను వదిలివెళ్లిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. వాటిని పరిష్కరించే పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రతి డివిజన్ ను ఒక యూనిట్ గా చేసుకుని.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాలలో మురుగునీటి పారుదల వ్యవస్థ, సౌకర్యవంతమైన రహదారులు, పుష్కలమైన తాగునీరు, మెరుగైన విద్యుత్ వ్యవస్థ వంటి కనీస వసతులను కల్పిస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా రూ. 12 లక్షల అంచనా వ్యయంతో హెచ్ 3 బ్లాక్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. యూజిడి ఏర్పాటుతో దాదాపు 384 కుటుంబాల దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన నిర్వహించుకుంటున్నామని.. ఈ పనులను ప్రజలు గమనించాలని కోరారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా రాబోవు రోజుల్లో ఇటువంటి మరెన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలియజేశారు. అలాగే అభివృద్ధి పనులలో స్థానికులు సైతం భాగస్వాములై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. తద్వారా పనులు మరింత నాణ్యతతో పూర్తి చేసే అవకాశాలుంటాయన్నారు. కార్యక్రమంలో నాయకులు నాలం బాబు, రామాంజనేయులు, కోటేశ్వరరావు, ఆర్.ఎస్.పద్మావతి నాయుడు, మీసాల సత్యనారాయణ, వియ్యపు మురళి, రాజు, వెంకటేశ్వరరావు, రాంబాబు, దుర్గాప్రసాద్ రెడ్డి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.