-నిర్థేశించిన గడువులోగా భవన నిర్మాణాలను పూర్తికి చర్యలు తీసుకోండి..
-జిల్లాకలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలపై అధికారులు దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాల ప్రగతిపై సోమవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు కలెక్టరేట్ నుండి యంపిడివోలు, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎ. వెంకటేశ్వరరావు, ఆ శాఖ వివిధ స్థాయి ఇంజనీరింగ్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన 268 గ్రామసచివాలయల భవనాలు, 239 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 260 రైతుభరోసా కేంద్రా భవనాలను సెప్టెంబర్ మాసాంతంలోగా పూర్తి చేయాల్సిన భాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు.
ఇప్పటి వరకు 148 గ్రామ సచివాలయల భవనాలు, 75 రైతుభరోసా కేంద్రాల భవనాలు, 50 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు పూర్తి అయ్యాయన్నారు. వీటిలో వివిధ కారణాలతో ఇంకనూ ప్రారంభం కాని 41 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 11 గ్రామ సచివాలయల భవనాలు, 31 రైతుభరోసా కేంద్ర భవన నిర్మాణాల పనులను తక్షణమే ప్రారంభించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న 57 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 22 గ్రామ సచివాలయ భవనాలు,61 రైతుభరోసా కేంద్రాల భవన నిర్మాణాలను బేస్మెంట్ స్థాయికి, బేస్మెంట్ స్థాయిలో ఉన్న 38 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 7 గ్రామ సచివాలయ భవనాలు,24 రైతుభరోసా కేంద్రాల భవన నిర్మాణాల పనులను రూఫ్ స్థాయికి తీసుకురావాలన్నారు. రూఫ్ స్థాయిలో ఉన్న వాటిని ఫినిషింగ్ స్థాయికి తీసుకువచ్చి పూర్తి చేయాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో భవన నిర్మాణ పనుల వేగవంతానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాల ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులను మంజూరు చేయడం జరుగుతుందని సెప్టెంబరు మాసాంతానికి భవన నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించుకుని ఆచరణలో ఉంచాలని కలెక్టర్ డిల్లీరావు టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు.