-మొదటి ఏడాదిలో .41.26 కోట్లతో 469 పనులు మంజూరు
-9 కోట్లతో జిల్లా పరిషత్ కు కొత్త మీటింగ్ హాల్ ఏర్పాటు
-35 లక్షలతో ఎన్టీఆర్ జిల్లాలో మీటింగ్ హాల్ ఏర్పాటు
-జడ్పీచైర్పర్సన్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పిటిసి, ఎంపీపీ, ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి జిల్లా పరిషత్ ను ప్రథమ స్థానంలో నిలుపుటకు కృషి చేస్తానని జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. కృష్ణాజిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం జిల్లా పరిషత్ లో జడ్పిటిసిలతో సమావేశం నిర్వహించారు. తొలుత చైర్పర్సన్ జడ్పిటిసి లతో కలిసి జడ్పీ ప్రాంగణంలో వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చైర్ పర్సన్ సభ్యులతో కలసి కేక్ కట్ చేసారు. పాలకవర్గం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సభ్యులందరికీ అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం మొదటి ఏడాదిలో వివిధ పద్దుల క్రింద ₹. 41.26 కోట్లతో 469 పనులు మంజూరు చేసినట్లు, అవి వివిధ ప్రగతి దశలో ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఇటీవల పెడన వచ్చినప్పుడు పాత జడ్పీ మీటింగ్ హాలు స్థానంలో కొత్త మీటింగ్ హాలు నిర్మాణ ఆవశ్యకతను వివరించానని, నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరగా 9 కోట్లు మంజూరు చేసినట్లు చైర్పర్సన్ తెలిపారు. నిధులు విడుదల కాగానే పనులు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. అదే విధంగా 35 లక్షలతో ఎన్టీఆర్ జిల్లాలో జడ్పీ సమావేశాలకు సమావేశ మందిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జడ్పీ ఆదాయ వనరుల నుండి గత ఏడాది 89.55 లక్షలు ఆదాయం రాగా, తమ పాలకవర్గం వచ్చాక జడ్పీ ఆదాయం 1.40 కోట్లకు పెంపునకు కృషి చేసినట్లు తెలిపారు. మహిళా సాధికారత సాధనకై మచిలీపట్నం జెడ్పి ఆవరణలో కోటి 50 లక్షలతో, అవనిగడ్డ, ఉయ్యూరులలో ఒక్కొక్కటి ఒక కోటి ఐదు లక్షలతో స్త్రీ శిశు సంక్షేమ నిధులతో వాణిజ్య సముదాయాలను నిర్మించుటకు శంకుస్థాపన గావించినట్లు తెలిపారు. తమ పాలకవర్గం హయాంలో వివిధ కేటగిరీలలో 50 మంది జడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు, 26 మందికి కారుణ్య నియామకాలు చేసినట్లు తెలిపారు.