– పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్
– సీబీఎస్ఈ విద్యపై రిసోర్సు పర్సన్లకు శిక్షణ, అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురువులకు మించి ఈ ప్రపంచంలో ప్రత్యామ్నాయంగా నిలవగలిగే పరికరాలు ఏవీ లేవని ఉపాధ్యాయులను ఉద్దేశిస్తూ పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్. సురేష్ కుమార్ అన్నారు.
విజయవాడలోని ఓ హోటల్లో రెండ్రోజుల పాటు జరిగిన ‘సీబీఎస్ఈ విద్యపై రిసోర్సు పర్సన్లకు శిక్షణ, అవగాహన’ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను దశల వారీగా సీబీఎస్ఈకి అనుసంధానించాలనుకున్నామని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 1000 పాఠశాలలను సంపూర్ణ నాణ్యత ఉండే విధంగా మలచడానికి తగిన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సీబీఎస్ఈ బోర్డు విషయ నైపుణ్యాలతో పాటు బోధన ప్రక్రియలు – విధానాలు, పరీక్షల నిర్వహణ, అందుకు సంబంధించిన ప్రణాళికలు తదితర అంశాల్లో రిసోర్సు పర్సన్లకు తర్పీదు ఇస్తున్నామని అన్నారు.
బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబులు అందించడం ద్వారా ఇంటర్నెట్, వైఫై సదుపాయం లేకపోయినా విద్యార్థులు ఎల్లవేళలా స్వీయాభ్యసనం చేయడం ద్వారా ఉపాధ్యాయుల శ్రమను తగ్గించే విధంగానూ, విద్యా నాణ్యత పెరిగే విధంగా, అనవసర యాప్ లను వీక్షించడాన్ని నియంత్రించడం చేయవచ్చని అన్నారు. పరీక్షలు నిర్వహించినప్పటికీ, పేపర్లు దిద్దాల్సిన అవసరం లేకుండానే ఫలితాలు చెప్పవచ్చని, పిల్లలు కూడా సులభంగా సమగ్ర అవగాహన పెంపొందించుకోవడానికి తోడ్పడుతుందని తెలిపారు. బైజూస్ పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయలు అపోహ పడాల్సిన అవసరం లేదన్నారు.
మార్పుపైన విశ్వాసం ఉండాలని, తద్వారా తమను తాము మార్చుకోవడం అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. ఉపాధ్యాయుల పట్ల వ్యక్తిగతంగా చాలా గౌరవం ఉందని, ఎంతోమంది మంచి ఉపాధ్యాయులు సమాజంలో కష్టపడి పని చేస్తున్నారని అభినందించారు. నేటితరంలో పిల్లలు ప్రపంచీకరణ నేపథ్యంలో ఇరుగుపొరుగు ప్రాంతాల వారితో పోల్చుకోవడం మాని, ప్రపంచ స్థాయిలో ఉన్నతమైన విద్యాలయాలతో పోల్చుకోవడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నారు. సీబీఎస్ఈ పాఠశాలలుగా రాష్ట్ర విద్యాలయాలు మారడం ద్వారా త్వరలోనే విద్యాపరంగా అభ్యున్నతి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సీబీఎస్ఈ రాష్ట్ర కార్యస్థానం విజయవాడలో ఏర్పాటు కానున్నదని తెలిపారు.
సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్. మస్తానయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యాజమాన్యాలు చెందిన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు 130 మంది జిల్లా స్థాయి రిసోర్సు పర్సన్లుగా పాల్గొన్నారు. జిల్లా రిసోర్స్ పర్సన్లకు ఢిల్లీ, భువనేశ్వర్, చెన్నై నుంచి పాల్గొన్న చెందిన సీబీఎస్ఈ రిసోర్స్ పర్సన్లు డా. సందీప్ జైన్ (జాయింట్ సెక్రటరీ, ట్రైనింగ్), అరుణిమ మజుందార్ (జాయింట్ సెక్రటరీ, అకడమిక్స్), ఎస్. ధరణి అరుణ్ (జాయింట్ సెక్రటరీ, అఫ్లియెషన్), విజయలక్ష్మి, దివ్య భరద్వాజ్ (అసిస్టెంట్ సెక్రటరీ, ఎనలిస్ట్, ఐటీ), సందీప్ శ్రీవత్సవ (అసిస్టెంట్ సెక్రటరీ, సీబీఎస్ఈ), దినేష్ రామ్ (ప్రాంతీయ అధికారి, చెన్నై), కె.శ్రీనివాసన్ ( ప్రాంతీయ అధికారి, భువనేశ్వర్), నీతి శంకర్ శర్మ (డిప్యూటీ సెక్రటరీ, స్కిల్ ఎడ్యుకేషన్), మీనూ జోషి ( ప్రాంతీయ అధికారి, విజయవాడ) తదితరులు శిక్షణ మెలుకువలు అందించారు.