– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆడపడుచుల ఆత్మ గౌరవం పెంచేందుకే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక రీతిలో వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని షాదీఖానా నందు ఆదివారం జరిగిన వైఎస్సార్ ఆసరా మూడో విడత సంబరాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆడపడుచులతో కలిసి సీఎం జగనన్న చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందేశాన్ని అక్కచెల్లెమ్మలకు వినిపించారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పథకాలు అమలు చేయగా.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచ బ్యాంకు అధికారులు కొనియాడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే మహిళాభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. అక్కచెల్లెమ్మల జీవన ప్రమాణాల మెరుగుదలతో పాటు గృహిణులకు సమాజంలో గౌరవం పెంచేందుకు ఈ ప్రభుత్వం ఆసరాతో సహా మరికొన్ని పథకాలను సమర్థంగా నిర్వహిస్తూ.. వారి ఉన్నతికి కారణం అవుతోందన్నారు. 58 డివిజన్ కు సంబంధించి మూడవ విడత ఆసరా ద్వారా 233 గ్రూపులలోని 2,330 మంది అక్కచెల్లెమ్మల ఖాతాలలో రూ. కోటి 9 లక్షల 95 వేల 154 రూపాయల నిధులు జమ చేసినట్లు తెలిపారు. అలాగే డివిజన్లో 1,489 మంది అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు విలువ చేసే ఇంటి పట్టాలను అందజేసినట్లు వెల్లడించారు. డిసెంబర్ నాటికి నిర్మాణాలు పూర్తిచేసి.. గృహ ప్రవేశాలు జరిగేలా చూస్తామని తెలియజేశారు. అమ్మ ఒడి, ఆసరా, వైఎస్సార్ చేయూత, ఈబీసీ నేస్తం తదితర పథకాల ద్వారా అర్హత గల వారందరికీ లబ్ధి చేకూరుస్తూ మహిళా పక్షపాతిగా నిలిచిన సీఎం జగనన్నకు మహిళలందరూ అండగా నిలవాలని మల్లాది విష్ణు విజ్ఞప్తి చేశారు.నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. ఇంటిని నడిపే సారథికి చేయూతగా నిలిచి, బాధ్యతలు పంచుకునే గృహిణులకు మరింత ఊతం ఇచ్చేందుకు వైఎస్సార్ ఆసరా పథకానికి జగనన్న ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగపరచుకుని.. గ్రూపులను మరింతగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలకు మెగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సృజనా, సీడీఓ జగదీశ్వరి, నాయకులు అఫ్రోజ్, తోపుల వరలక్ష్మి, పొదుపు సంఘాల మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News