-ధాన్యం కొనుగోళ్లపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..
-ఎకరానికి 40 కేజీల బస్తాలు 95 కొనుగోలు చేసేలా చర్యలు..
-రైతుల విజ్ఞప్తి మేరకు స్పందించిన ప్రభుత్వం
-వివరాలను వెల్లడించిన హోంమంత్రి తానేటి వనిత
కొవ్వూరు,నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తుందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. రైతులందరూ సంతోషంగా ఉండాలి, వ్యవసాయం అంటే పండగలా చేసుకోవాలని అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలను జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంపై రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొవ్వూరులోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… విత్తనం దగ్గర నుంచి పంట విక్రయం వరకూ అన్ని వేళలా రైతులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో విస్తారంగా పండిన ధాన్యాన్ని మంచి గిట్టుబాటు ధరతో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గంలో శుక్రవారం వరకూ ఎకరానికి 79 బస్తాలు మాత్రమే (40 కేజీల బస్తాలు) కొనుగోలు చేసేవారని.. రైతుల విజ్ఞప్తి మేరకు రేపటి నుండి 95 బస్తాలు (40 కేజీలు) కొనుగోలు చేస్తారని హోంమంతి ప్రకటించారు. నియోజకవర్గంలో పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉన్నారని ఆమె తెలిపారు. ఈ సంతోషం మరింత పెంచేలా పౌర సరఫరాల శాఖ నుంచి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఇప్పటి వరకు ఎకరానికి 79 బస్తాల పరిమితిని నుంచి 95 బస్తాలకు పెంచడం జరిగిందని హోంమంతి తానేటి వనిత తెలిపారు. ఆన్లైన్ విధానం అమలు చేయడం ద్వారా జవాబుదారీతనం తో పాటు పారదర్శకత కు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులందరికీ ధాన్యం కోనుగోలుకు ఉచితంగా గోనె సంచులు అందించడంతో పాటు హామాలీ ఛార్జీలు, రవాణా చార్జీలు రైతులకు చెల్లిస్తున్నా మన్నారు. మధ్యలో ఎలాంటి అవినీతి జరగకుండా, దళారులకు తావులేకుండా నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో డబ్బు జమ అవుతుందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, భరోసా కల్పిస్తోందని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.