-సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు
-సైబర్ భద్రత కోసం వివిధ పోటీలు
-విద్యార్థులకు, విద్యా సంస్థలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సువర్ణావకాశం
-చివరి తేది జూలై 30
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సైట్ (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ) ఆధ్వర్యంలో NCERT (National Council of Educational Research and Training), సైబర్‌పీస్ ఫౌండేషన్‌తో కలిసి ఐదో ‘ఇ రక్ష 2023’ వ పోటీలు నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు గారు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ విద్యా విధానం (NEP) – 2020లో డిజిటల్ విద్యావిధానంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సైబర్ ముప్పు నుండి తప్పించుకునేలా, డిజిటల్ పరికరాలు వాడుతున్నప్పుడు సైబర్ భద్రతా పదాలు, బెదిరింపులు, సవాళ్లు, భద్రతా పద్ధతులను అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి వీలుగా పరిశోధన పత్రాలు, కార్టూన్లు, వీడియోలు, రీళ్లు, లఘుచిత్రాలు, అప్లికేషన్లు, సొల్యూషన్లు తదితర అంశాలపై పోటీలు ఉంటాయని, ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాత్రమే పంపాలని తెలిపారు. నాలుగు కేటగిరిల్లో జరిగే ఈ పోటీలు విద్యార్థి విభాగం, విద్యావేత్తల విభాగం, విద్యా సంస్థల విభాగం, తల్లిదండ్రులు-సంరక్షకుల విభాగంలో ఉంటాయని తెలిపారు. మే 3 నుండి జూలై 30వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు www.eraksha.net వెబ్ సైట్ సందర్శించాలని కోరారు. సందేహాలకు eraksha@cyberpeace.netని, లేదా 8235058865కు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.