-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-26 వ డివిజన్ 28 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 26 వ డివిజన్ 28 వ వార్డు సచివాలయ పరిధిలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ, కోఆర్డినేటర్ కోలా నాగాంజనేయులుతో కలిసి బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కాకానీ నగర్లో విస్తృతంగా పర్యటించి 412 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ప్రాంత ప్రజలు ఘన స్వాగతం పలికారు, కర్పూర హారతులు పట్టారు. శాలువలతో ఘనంగా సత్కరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేర్చినట్లు మల్లాది విష్ణు తెలిపారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. పేదల కోసం ఏ ఒక్క మంచి కార్యక్రమం చేపట్టలేకపోయారని ఆరోపించారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాల పథకాల ద్వారా పేదల జీవన స్థితిగతులలో సమూల మార్పులు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. అనంతరం ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచనలు చేశారు.
అవ్వాతాతల కంటికి వెలుగు
కంటి చూపు మందగించిన శాఖమూరి సాయిబాబు అనే వ్యక్తికి వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కళ్ల పరీక్షలు నిర్వహించడమే కాకుండా కళ్లద్దాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ద్వారా జగనన్న ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదన్నదే ఉద్ధేశంతో.. మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. సామూహిక కంటి పరీక్షల ద్వారా 5.60 కోట్ల మంది ప్రజల్లో నేత్ర సమస్యలను పరిష్కరించే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ పథకం కింద ఒక్క రూపాయి ఖర్చు చేయకుండానే పూర్తి ఉచితంగా కంటి పరీక్షలతో పాటు అవసరమైన చికిత్సలు, కళ్ల జోళ్లను అందించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు మెప్పు కోసం సీపీఐ రామకృష్ణ ఆరాటం
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు గూర్చి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకి తొత్తుగా మారిన సీపీఐ రామకృష్ణకి ఏమాత్రం లేదని మల్లాది విష్ణు అన్నారు. ప్రజల కోసం పోరాటం చేయవలసిన సీపీఐ నాయకులు.. టీడీపీ అజెండాను భుజానికి ఎత్తుకుని పనిచేయడం సిగ్గుచేటన్నారు. ప్రాజెక్టు తొలిదశను పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే.. తెలుగుదేశం, సీపీఐ నాయకులకు ఎందుకంత కడుపు మంట అని ధ్వజమెత్తారు. పోలవరం అంటే ఎప్పటికైనా గుర్తొచ్చేది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారని.. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ మహానేత హయాంలోనే 75 శాతం భూసేకరణ జరిగిందన్నారు. కానీ పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని.. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టును కమీషన్ల కోసం టేక్ ఓవర్ చేసి, ఇష్టానుసారంగా వందిమాగదుల కంపెనీలకు నిధులను దోచిపెట్టారన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ తో రూ. 843.53 కోట్లను ఆదా చేయడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల స్వప్నం పోలవరం ప్రాజెక్టు.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. ఇకనైనా చంద్రబాబు మెప్పుకోసం పనిచేయడం మానుకోవాలని సీపీఐ రామకృష్ణకు సూచించారు. కార్యక్రమంలో నార్త్ ఎమ్మార్వో దుర్గాప్రసాద్, ఆర్.ఐ.ప్రసాద్, సీడీఓ జగదీశ్వరి, నాయకులు బాడిద అప్పారావు, డి.శంకర్, పారా ప్రసాద్, బి.రాజు, ఎం.శ్రీనివాస్, సిద్ధాబత్తుల రమణ, పసుపులేటి కోటేశ్వరరావు, బాడిత సత్యవతి, బెజ్జం రవి, భోగాది మురళి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.