-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో 8,500 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు అయ్యాయని, ఆంధ్ర ప్రదేశ్ వైద్యారోగ్య రంగానికి ఇది స్వర్ణయుగమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు.
శుక్రవారం మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలను జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, మాజీ మంత్రివర్యులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ), రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎం. టి. కృష్ణబాబుతో కలిసి పరిశీలించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యాయని 550 కోట్ల రూపాయల వ్యయంతో 64 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మచిలీపట్నం మెడికల్ కళాశాల అత్యంత ఆధునిక సదుపాయాలతో పటిష్టంగా నిర్మించబడటం ఎంతో శుభ సూచికమన్నారు. రాష్ట్రంలో ఐదు కాలేజీలను ప్రయారిటీ కాలేజీలుగా గుర్తించామని ఈ విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుంచి అడ్మిషన్స్ ప్రారంభం కానున్నాయిని, అలాగే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం వైద్య కళాశాలకు సంబంధించి మెడికల్ ఇన్స్పెక్షన్స్ కూడా పూర్తయ్యాయని ఆమె తెలిపారు .
ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ విద్యార్థిని విద్యార్థునులు విద్యను అభ్యసించేలా తీర్చిదిద్దేరన్నారు. ఇప్పటికే ఈ కాలేజీలకు జాతీయ వైద్య విధాన మండలి అనుమతులు వచ్చాయన్నారు. ఈ ఏడాది 750 ఎంబిబిఎస్ సీట్లు రాష్ట్రానికి వస్తాయని మంత్రి వివరించారు.
తొలుత ఆమె మచిలీపట్నం వైద్య కళాశాలలోని అడ్మినిస్ట్రేటివ్ వింగ్, డిజిటల్ పోడియంను పరిశీలించారు. తర్వాత లెక్చరల్ గ్యాలరీ రూముకు వెళ్లి వీడియో కాన్ఫరెన్స్ లో బిగ్ స్క్రీన్ పై మాట్లాడారు. రాజమండ్రి, నంద్యాల విజయనగరం తదితర మెడికల్ కళాశాల వైద్య అధ్యాపక బృందంతో మంత్రి విడదల రజిని పలు వైద్య విషయాలపై సంభాషించారు. తరువాత మెడికల్ కళాశాల ప్రాంగణంలోని ఉమెన్స్ హాస్టల్ కు వెళ్లి విద్యార్థునులకు కేటాయించిన గదులను, భోజనశాలను, టాయిలెట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ, నాడు నేడు పథకం కింద 16 వేల కోట్ల రూపాయలతో గ్రామస్థాయి నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలను అభివృద్ధి పరిచినట్లు తెలిపారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా 50 వేల నియామకాలు, అలాగే మరో 3 వేల ఉద్యోగాలను కల్పించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. నూతన ఒరవడలతో ప్రజలకు అనన్య రీతిలో అనుకూలమైన పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని గమనించాలని మంత్రి సూచించారు.
అలాగే వైయస్సార్ విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ముందస్తు భద్రత లో భాగంగా వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఒక కోటి 80 లక్షల మంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.
అనంతరం మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబీకులు అత్యధికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేది ఎక్కువగా విద్య, వైద్య రంగమన్నారు. ఈ రెండు ముఖ్య శాఖలు ప్రభుత్వ పరిధిలో ఉంటే ఎంతో కొంత వెసులుబాటు ప్రజలకు ఉంటుందన్నారు. వైద్యుల లభ్యత పెరగాలంటే మెడికల్ కళాశాలల ఏర్పాటు. ఎన్నేళ్లు పరిపాలన చేసేమనేది ముఖ్యం కాదని.. ఎంత వరకు ఆదర్శంగా పాలన చేసేమనేది ప్రజా ప్రతినిధుల జీవితంలో ఒక గీటురాయి వంటిదన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిందని, అప్పటినుంచి ఇప్పటివరకు మన రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలో ఉంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం నాలుగేళ్ల పాలనా కాలంలో 17 మెడికల్ కళాశాలలు స్థాపించిన ఘనత చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుందన్నారు. 2021లో ఐదు మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేసి రెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఐదు కళాశాలలో 750 మెడికల్ సీట్లతో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వైద్య విద్యార్థిని విద్యార్థులను వైద్య విద్యను అభ్యసించే విధంగా తీర్చిదిద్దడం ఎంతో ప్రాముఖ్యమైనదని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటులో జిల్లాకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన మెడికల్ కళాశాల నిర్మాణం పనులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారన్నారు. ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు అడ్డం వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని కళాశాల నిర్మాణానికి విశేష కృషి చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారి డాక్టర్ డి.ఎస్.వి.ఎల్. నరసింహారావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమారి, వైస్ ప్రిన్సిపాల్స్ స్వర్ణలత, ఆశాలత, హాస్పటల్ సూపర్నెంట్ జి.ఎస్. రమేష్, మచిలీపట్నం ఆర్డిఓ ఐ. కిషోర్ మెఘా ఇంజనీరింగ్ సంస్థ సైట్ ఇంజనీర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.