వర్షాలు, వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

-ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
-జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ఇటీవల కాలంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టీ.కృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, జిల్లా ఎస్పీ పి.జాషువా, అడిషనల్ ఎస్పీ ఆర్. శ్రీహరిబాబు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు లతో కలసి పాల్గొన్నారు.

అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ స్పందన సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ తో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి కృష్ణానది ద్వారా పెద్ద మొత్తంలో వస్తున్న వరదనీటి ప్రవాహం పట్ల అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ నేపథ్యంలో అధికారులందరూ శని, ఆదివారాలలో సైతం అందుబాటులో ఉండాలని, క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు.

కృష్ణానది పరివాహక ప్రాంతంలో కట్టలను నిత్యం పర్యవేక్షించాలని, ప్రమాదం పొంచి ఉన్న జిల్లాలోని ప్రధాన కాలువలు, చెరువుల కట్లకు గండి పడకుండా ముందస్తుగా ఇసుక బస్తాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. తూడు, గుర్రపుడెక్కలతో పూడుకుపోయిన మురుగు కాలువలను శుభ్రపరచాలని తద్వారా పెద్ద మొత్తంలో నిలిచిపోయిన నీరు ఖాళీ అవటానికి అవకాశం ఉందన్నారు. డయేరియా, ఇతర వ్యాధులు వ్యాప్తి చెందకుండా పట్టణాలతోపాటు గ్రామాలలో నీటి కలుషితం కాకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, క్రమం తప్పకుండా క్లోరినేషన్, బ్లీచింగ్ చేపట్టాలన్నారు.

పశువులకు వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మేత కొరత లేకుండా చూడాలని అధికారులకు చెప్పారు. వర్షాల కారణంగా ప్రజా రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్తూ కోతకు గురైన రోడ్లను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలన్నారు.

గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, పాము కాటుకు యాంటీవీనం ఇంజక్షన్లను ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అన్ని పీ హెచ్ సీ లలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్ ఎల్ ఎస్ పాయింట్లలో రేషన్ సరుకులను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ఆయా డివిజన్ల ఆర్డీవోలు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని, పరిస్థితులను నిత్యం పర్యవేక్షించాలని చెప్పారు.

జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు,వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *