మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు.
శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ లోని తన చాంబరు నుంచి జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పాల్గొన్నారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ – 2024కు సంబంధించి ఓటర్ల జాబితా తయారీపై ఎన్నికల అధికారులు తీసుకోవలసిన చర్యలపై ఆయన సమీక్షించారు. జిల్లాలోని ఓటర్ల జాబితా తయారీ పురోగతిని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లాలో స్వచ్ఛ ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయనకు తెలిపారు.
వచ్చే ఆగస్టు 2, 3 తేదీలలో విశాఖపట్నంలో రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో భారత ఎన్నికల సంఘం నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి ఆయా జిల్లాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని, కృష్ణాజిల్లాకు సంబంధించిన ఎన్నికల అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సిద్ధం చేసి సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కలెక్టర్ కు సూచించారు.
ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్యామ్ నాథ్ కలెక్టర్ తో పాటు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.