-మంత్రి జోగి రమేష్
కృత్తివెన్ను (చిన చందాల/పెద చందాల/దోమలగొంది), నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం కృషి చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
గురువారం ఆయన కృత్తివెన్ను మండలం గరిశపూడి గ్రామ సచివాలయ పరిధిలోని చిన చందాల, పెద చందాల, దోమలగొంది గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి వివరాలను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు వివరించి చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుల మత ప్రాంత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారన్నారు. తల్లులకు అమ్మఒడి నుంచి అవ్వాతాతలకు పింఛను వరకు లబ్ధిదారులకు పథకాలను చేరవేసే క్రమంలో దళారులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే చేరుతున్నాయని, దీనివల్ల అవినీతికి తావే లేదని పునరుద్ఘాటించారు. అర్హులైయుండి వివిధ కారణాలతో సంక్షేమ పథకాలకు దూరమైన వారికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను తక్షణమే మంజూరు చేసి వారికి సంక్షేమ పథకాలను వర్తింప చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అందరి అవసరాలను తీరుస్తూ అండగా ఉంటున్న మన ముఖ్యమంత్రికి మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అంతర్గత రహదారులు, డ్రైనేజీలు నిర్మించాలని కోరగా తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
కాబోయే తల్లుల ఆరోగ్యం ఎంతో ముఖ్యం:
గర్భవతులు, బాలింతల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని భావించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి టేక్ హోమ్ రేషన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారని అన్నారు. తల్లులు బాగుంటేనే పుట్టబోయే పిల్లలు పుష్టిగా, ఆరోగ్యంగా ఉంటారని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేరుగా ఇంటి వద్దకే అన్ని రకాలతో కూడిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
గురువారం గరిశపూడి గ్రామ సచివాలయ పరిధిలోని చిన చందాల, పెద చందాల, దోమలగొంది గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తూ స్థానికంగా ఉన్న ఆయా గ్రామాల అంగన్వాడి కేంద్రాల వద్ద గర్భిణీ స్త్రీలు, బాలింతలకు 11 రకాల ఆహార పదార్థాలతో కూడిన సంపూర్ణ పోషకాహార కిట్టులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను మండల జెడ్పీటీసీ మైలా రత్న కుమారి, బంటుమిల్లి మార్కెట్ యార్డు చైర్మన్ కొల్లాటి బాలగంగాధరరావు, కృత్తివెన్ను ఎంపిడిఓ జీ.పిచ్చిబాబు, కృత్తివెన్ను తాసిల్దారు రామకోటేశ్వరరావు, గరిశపూడి గ్రామ సర్పంచ్ నాగిడి నాగార్జున, పార్టీ మండల కన్వీనర్ రాజబాబు వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.