విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చ డమే “సు పరిపాలన” అని ఆంధ్ర ప్రదేశ్ సి. ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు అన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహనరెడ్డి పరిపాలన ఆ దిశ లోనే కొనసాగుతోందన్నారు.విశాఖపట్నం జిల్లాపరిషద్ సమావేశ మందిరంలో “సుపరిపాలన దిశగా ఆంధ్ర ప్రదేశ్ రూపాంతరం” అంశంపై అవర్ స్టేట్ అవర్ లీడర్, వై.ఎస్.ఆర్ ఇంటలెక్ట్యువల్ ఫోరం ఆధ్వర్యం లో సోమవారం యేర్పాటచేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరిపాలనను ప్రజల గడప వరకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన రెడ్డికి చెందుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల సంస్థలు యేర్పాటుచేసి రైతుల, ప్రజల అవసరాలను అప్పటికప్పుడు తీర్చగలగడం సుపరిపాలనా కాదా అనేది ప్రజలు తేల్చుకోవాలని ఆయన అన్నారు. అభివృద్ధి నిర్వచనానికి ఉదాహరణగా పులివెందుల నిలుస్తుందని ఇటీవలతమ పర్యటన లో తెల్సుకున్నామని, 14 యేళ్ల ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తి నియోజకవర్గం లో ఈ స్థాయి అభివృద్ధి కనిపించదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు కనిపించకుండా చేసే ప్రయత్నాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన కోరారు. ఈ ప్రయత్నాలకు కొన్ని వర్గాల మీడియా వంతపాడడం విచారకరమన్నారు.నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొ. బాలమోహన దాస్ మాట్లాడుతూ 10 అంశాలతోకూడిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స 2019 లో యేర్పాటు చేశారన్నారు. దీనిలో మనరాష్ట్రం 7 వ స్థానంలో వుందనిఅన్నారు. ప్రభుత్వ విధానం, “అధికార వికేంద్రీకరణ” ప్రకారం రాయలసీమ ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజలకు దూరాభారం కాకుండా వుండేందుకు వీలుగా కొన్ని సూచనలు ఆయన చేశారు. విశాఖలో పరిపాలన రాజధానిగా చేసినా, మినీ సెక్రేటేరియట్ ను అమరావతి లో పెట్టడంద్వారా రాయలసీమ వాసులకు సెక్రెటేరియట్ దూరమవుతుందన్న ఆందోళనకు సర్దుబాటు చేయవచ్చు అని ఆయన అన్నారు. అదేవిధంగా కర్నూలులో హైకోర్టు పెట్టినా, హైకోర్టు బెంచిని అమరావతిలో పెట్టడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు హైకోర్టు దూరమవుతుందన్న ఆలోచనను నివారించగలిగే అవకాశం వుంటుందన్నారు. ఆ విధంగా, అమరావతి లో శాసన రాజధాని తో పాటు, మినీ సెక్రేటేరియట్, హైకోర్టు బెంచి యేర్పాటు కావడం ద్వారా అక్కడి రైతులకు న్యాయం చేసినట్లవుతుందని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ, వంటి పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు చేరువైందని, అన్ని వ్యాధులను ఈ పథకంలోకి తేవాలని ఆయన సూచించారు.రాజకీయ నాయకులను, పలుకుబడి వున్న పెత్తందారులను వారి అవసరాలకు ప్రజలు ఆశ్రయించని సమాజాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన రెడ్డి మన ముందుకు తెచ్చారని పల్లె దుర్గారావు అన్నారు. అంతకు మించిన సుపరిపాలన యేముంటుందని ఆయన ప్రశ్నించారు.ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రొ. వెంకట్రావు, ఎ.పి. యాంటీ డ్రగ్ కన్వీనర్ బేతా సురేష్, ఇన్నవేషన్ సొసైటీ జాయింట్ డైరక్టర్ లావణ్య, ఎం పాల్ భాస్కర్‌లు ప్రసంగించారు. సదస్సు కు అవర్ స్టేట్, అవర్ లీడర్, వై.ఎస్. ఆరి ఇంటలెక్ట్యువల్ ఫోరం ఛైర్మన్ జి. శాంతమూర్తి అధ్యక్షత వహించారు.
Prajavartha Online Telugu News