-కానూరు జడ్పీ హైస్కూల్లో జగనన్న గోరుముద్ద పథకం అమలు తీరు అకస్మిక పరిశీలన
-మెరుగైన పౌష్టికాహారంతోనే ఆరోగ్యం,చక్కటి విద్యాభ్యాసం సాధ్యమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు.
కానూరు , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథక అమలు తీరును స్వయంగా తెలుసుకునేందుకు కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు ఏ ఎస్ ఎన్ ఆర్ ఏ జిల్లా పరిషత్ హైస్కూల్లో గురువారం కలెక్టర్ పి. రాజాబాబు ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ, కానూరు జడ్పీ హైస్కూల్ కు ఆకస్మికంగా వచ్చి గోరుముద్ద పధకం పరిశీలనలో భాగంగా రాగిజావ స్వయంగా సేవించానని అది ఎంతో రుచిగా సంతప్తికరంగా ఉందన్నారు. గోరుముద్ద పథకం కార్యక్రమాన్ని మరింతగా పటిష్టం చేసేందుకు ప్రభుత్వం గత ఆరునెలలుగా రాగిజావ సైతం పిల్లలకు అందజేస్తుందన్నారు. పిల్లలకు ఐరన్, కాల్షియం ఈ ఆహారం ద్వారా సమకూరి వారు బలంగా ఎత్తుగా పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.1 వ తరగతి నుంచి 10 తరగతి పిల్లలకు కృష్ణాజిల్లాలో ప్రభుత్వం 1300 స్కూళ్ళల్లో దాదాపు లక్ష మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందజేస్తుందన్నారు. స్కూల్ పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందిస్తుందని తెలిపారు. గుడ్డు, చిక్కీ సహా అందిస్తున్న 15 ఆహార పదార్థాలకు ఇది అదనపు పౌష్టికాహారమని కలెక్టర్ తెలిపారు. వారంలో 5 రోజులపాటు ఉడికించిన గుడ్లు అందజేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. మూడు రోజులు చిక్కి , మంగళ, గురువారం, శనివారాల్లో రాగి జావ సైతం మెనూలో ఉందన్నారు. కానూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో 561 మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటున్నారని వారికి ఉత్తమమైన విద్యతోపాటు నాణ్యమైన పౌష్టికాహారం అందించే విధంగా పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.విద్యార్థులంతా జగన్ అన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకంలో భోజనాన్ని ఇష్టంగా తినేలా నాణ్యమైన, రుచికరమైన భోజనం వండి పెట్టాలని స్కూల్ సిబ్బందిని కలెక్టర్ పి. రాజాబాబు ఈ సందర్భంగా ఆదేశించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి తాహెరా సుల్తానా, డివైఈవో పద్మ రాణి, కానూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి , పలువురు హైస్కూల్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులున్నారు.
Prajavartha Online Telugu News