Breaking News

ఇండియా కూటమి పటిష్టతకై స్నేహ కలయిక

-సిపిఐ రామకృష్ణను కలిసిన సిడబ్ల్యుసి సభ్యులు డాక్టర్‌ ఎన్‌ రఘువీరారెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ అభ్యున్నతి కోసం ఇండియా కూటమి 28 రాజకీయ పార్టీలతో స్నేహభావంతో ఏర్పడిరదని, ఇండియా కూటమి పటిష్టతకై నేటి కాంగ్రెస్‌-సిపిఐ స్నేహపూర్వక కలయిక జరిగిందని, తనను ఆహ్వానించిన భారత కమ్యూనిస్టు పార్టీకి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణకు అభినందనలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ వర్కింగ్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ ఎన్‌ రఘువీరారెడ్డి తెలిపారు.
కేంద్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ మెంబర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎన్‌ రఘువీరారెడ్డిని అభినందిస్తూ విజయవాడ, దాసరి భవన్‌ వద్ద కార్యక్రమం నిర్వహించారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ చిరకాల మిత్రులైన సిపిఐ రామకృష్ణ నిరంతరం అనంతపురం అభివృద్ధి కోసం పోరాడారని కొనియాడారు. విద్యార్థి దశలోనే రామకృష్ణ కృష్ణాజలాలను రాయలసీమకు తరలించాలంటూ గోడలపై స్లోగన్‌లు రాయటం తనని ఆకర్షించిందని తెలిపారు. విద్యార్థి ఉద్యమంలో భిన్నధృవాలైన మా ఇద్దరి మధ్య మంచి స్నేహభావం ఉందన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అహంకారంతో అడ్డగోలుగా పాలన సాగిస్తున్నాయన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు పాల్గొన్నాయని, ఎంతోమంది కాంగ్రెస్‌, కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక అనేక నల్ల చట్టాలు తెచ్చారని, వ్యవసాయ చట్టాలు మాత్రమే వెనక్కు తీసుకున్నారని గుర్తు చేశారు. దేశంకోసం, ప్రజల రక్షణ కోసం, సంక్షేమం కోసం ఇండియా కృషిచేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సంఘటితంగా, మరింత ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ రఘువీరారెడ్డి, తను విద్యార్థి దశ నుండే రాజకీయ ప్రత్యర్థులుగా ఉండే వారమని, ఈరోజు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా శాలువాతో అభినందించటం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో విషాద పరిస్థితులు నెలకొన్న సందర్భంలో సిపిఐ, కాంగ్రెస్‌ రాజ్యాంగ, లౌకిక, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసికట్టుగా పనిచేస్తాయన్నారు. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గత 50 రోజులుగా అక్రమంగా అరెస్టుచేసి జైల్లో నిర్భంధించటంలో నరేంద్రమోడీ, అమిత్‌ షా, జగన్‌ల పాత్ర ఉందన్నారు. కేంద్రంలోని బిజెపి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతుంటే రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన వైసిపిగానీ, టిడిపిగానీ నోరెత్తలేక పోతున్నాయన్నారు. కనీసం చంద్రబాబు అరెస్టు కుట్ర వెనుక బిజెపి ఉందనే మాటను కూడా తెలుగుదేశం నేతలు అనడానికి భయపడుతున్నారన్నారు. బిజెపి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తూ ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలను అమలు చేయకుండా నిరాశ మిగిల్చిందన్నారు. రాజకీయ లబ్ధే బిజెపి లక్ష్యమని, తెలంగాణా ఎన్నికల సందర్భంగా మరోమారు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసేందుకు సిద్ధమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధికై టీడీపీ, జనసేన, వైసిపి పార్టీలు నరేంద్రమోడీతో మాట్లాడేందుకు ముందుకు రాకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేయడంలో సిపిఐ, కాంగ్రెస్‌ ముందుంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జెవి సత్యనారాయణమూర్తి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి ఓబులేసు, జి ఈశ్వరయ్య, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గా భవాని, సిపిఐ ఎన్‌.టి.ఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌, విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలీ, విజయవాడ నగర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, కాంగ్రెస్‌ నాయకులు సుధాకర్‌, వినయ్‌ కుమార్‌, సిపిఐ-కాంగ్రెస్‌ నగర నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *