రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్, చైల్డ్ వెల్ఫే కమిటీ మరియు జువెనైల్ జస్టిస్ బోర్డు సభ్యులకు “జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, 2015”, “మానవ అక్రమ రవాణా” మరియు “ప్రీ-అరెస్ట్, అరెస్ట్ మరియు రిమాండ్ దశలలో న్యాయ సేవలు” అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి. గంధం సునీత “జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015” పై పోలీసు అధికారులు మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు స్పష్టమైన అవగాహన అవసరమని పేర్కొన్నారు చట్టంతో విబేధించిన పిల్లలతో సదరు అధికారుల వ్యవహారిక శైలి సాధారణ కేసులలోని నిబంధనలకు భిన్నంగా ఉంటాయని అన్నారు. వారితో స్నేహపూర్వకంగా, సున్నితంగా వ్యవహరించాలని, ఈ చట్టంలోని నిబంధనలని ఖచ్చితంగా పాటించాలని అన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారు చట్టానికి జవాబుదారులు అవుతారని అన్నారు. ముఖ్యంగా పిల్లల వివరాలును, వారి గుర్తింపును ఎట్టి పరిస్థితులలో బహిర్గతం చేయరాదని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ జువెనైల్ జస్టిస్ ఆక్ట్ ప్రకారం సదరు అధికారులు పాటించాల్సిన నిబంధనలు, నిషిద్ధమైన చర్యల గురించి వివరించారు. 1వ అదనపు జుడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీమతి. ఎన్. జగదీశ్వరి గారు ప్రీ-అరెస్ట్, అరెస్ట్ మరియు రిమాండ్ దశలలో న్యాయ సేవలు గురించి వివరించారు. గౌరవ సుప్రీం కోర్టు వారు “డి.కె. బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం” కేసు ద్వారా అందించిన ఆదేశాలను గురించి వివరించారు. న్యాయ సేవాధికార సంస్థల్లో పనిచేస్తున్న ప్యానల్ లాయర్ల జాబితా అన్ని పోలీస్ స్టేషన్లలో ఉండాలని, న్యాయ సేవలు అవసరమైన వారికి తక్షణమే సహకారం అందించాలని తెలిపారు. 6వ అదనపు జుడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఎన్ రెడ్డి ప్రసన్న మానవ అక్రమ రవాణా నిర్మూలనలో పోలీసులు మరియు ఇతర అధికారుల పాత్ర గురించి, అక్రమ రవాణా బాధితులకు నల్సా వారి న్యాయ సేవల పథకం గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి పి. సూర్య ప్రభావతి, జువెనైల్ జస్టిస్ బోర్డ్ సభ్యురాలు శ్రీమతి. తబిత, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పోలీసు అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.
అనంతరం గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి. గంధం సునీత , మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ఆర్. రాజీవ్ లు అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏ.ఎస్.పి. సోమశేఖర్, రాజమహేంద్రవరం సౌత్ జోన్ డి.ఎస్.పి. శ్రీనివాసులు, కొత్తపేట డి.ఎస్.పి. కె. రమణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. ధర్మారావు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసాద్, రెవెన్యూ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News