-సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి పరిష్కారానికి కృషి.
-ఏపీ ఎన్జీవో ఎన్టీఆర్ నేత ఎ. విద్యాసాగర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయ ఉద్యోగులకు ఇకపై ఏపీ ఎన్జీవో సంఘం అన్నివేళలా అండగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ అన్నారు. గాంధీనగర్ లోని ఎన్జీవో హోమ్ లో గురువారం నాడు ఏపీ ఎన్జీజీఓస్ నగర శాఖ అధ్యక్షులు సీవీఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలోతొలి సారిగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సభ్యత్వం కల్పించారు. నగరంలో వివిధ సచివాలయ ఉద్యోగులు ఏపి ఎన్జిఒ సంఘం నగరశాఖలో సభ్యత్వం తీసుకున్న సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఇప్పటివరకు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఒంటరిగానే చేసిన పోరాటాలలో ఇకనుంచి ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కూడా మరింత బలంగా వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కు ఏడు దశాబ్దాల పైబడి ఉద్యమ చరిత్ర ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ సహేతుక పరిష్కారం చూపిందన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఇటువంటి సంఘంలో వార్డు సచివాలయ ఉద్యోగులు నేటి నుంచి సభ్యులుగా కొనసాగడం మీ సమస్యలు పరిష్కారానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ఏపీ ఎన్జీవో సంఘం ఏనాడూ…ఏ ప్రభుత్వంతోనూ రాజీ పడలేదన్నారు. చట్టబద్ధంగా ఉద్యోగులకు సంక్రమించిన హక్కులకు భంగం కలిగిన ప్రతీ సందర్భంలోనూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ పోరాటాలలో ముందు వరసలో ఉందన్నారు. తమ సంఘంలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కుటుంబంలో సభ్యులుగానే తాము భావిస్తున్నామన్నారు. మొదటినుంచి తమ నాయకులు సంఘంలోని సభ్యులు విధి నిర్వహణలో భాగంగా ఎదురయ్యే ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి సభ్యులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. సంఘంలో సభ్యులుగా చేరిన ప్రతి ఉద్యోగి సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా ప్రభుత్వం నుంచి చట్టబద్ధంగా ఉద్యోగులకు దక్కాల్సిన ప్రయోజనాల విషయంలో సంఘం నాయకులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. సచివాలయం ఉద్యోగులకు నగర నాయకులు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. మన సంఘంలోని ఏ సభ్యునికైనా సమస్య ఉత్పన్నమైతే పరిష్కారం కోసం ఉన్న మార్గాలను, అవకాశాలను పరిశీలించి అంతిమంగా సంఘ సభ్యునికి న్యాయం చేయడమే లక్ష్యంగా నాయకులు పని చేయాలన్నారు. ఐదు దశాబ్దాలుగా తమ సంఘంలోని సభ్యుల సమస్యల పరిష్కారంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కు ఎంతో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ అకాక్ష మేరకు పారదర్శకమైన సేవలు అందించి సచివాలయ వ్యవస్థకు పేరు ప్రఖ్యాతులు తేవాలని విద్యాసాగర్ కోరారు .నగర శాఖ అధ్యక్షులు సీవీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ నగరంలోని మూడు నియోజకవర్గాల పరిధిలో 2500 మంది సచివాలయ ఉద్యోగులకు సంఘంలో సభ్యత్వం కల్పించేందుకు నగర సంఘం నాయకులు ప్రతి సచివాలయాన్ని సందర్శించి అక్కడికక్కడే సచివాలయం ఉద్యోగులకు సభ్యత్వం కల్పించనున్నారని పేర్కొన్నారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.రాజుబాబు నగర శాఖ అధ్యక్షుడు సివిఆర్ ప్రసాద్ సెక్రటరీ ఎస్ కె నజీరుద్ధీన్ నగర శాఖ నాయకులు రాజశేఖర్, వి.వి. ప్రసాద్ శ్రీనివాసరావు,శివళీల, శ్రీనివాస్, షేక్ ఖాసీం, కె శివశంకర్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు కె గోపయ్య, యండి మెహబూబ్, వి సుజాత, సూర్యప్రభ ఉద్యోగుల పాల్గొన్నారు