-పూర్తి అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులతో సీఎం రివ్యూ చేశారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ఉన్న తాజా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ ద్వారా వర్షాలు, వరదలను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం అన్నారు. ముందస్తు ప్రణాళికతో పనిచేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఏడాది లో ఇప్పటి వరకు సాదారణ వర్షపాతం 185 మి.మి గాను 244 మి.మి నమోదైందని, రాష్ట్ర వ్యాప్తంగా 31 శాతం అదనంగా వర్షపాతం నమోదైందని అన్నారు. 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిన ప్రాంతాలు కూడా ఉన్నాయన్నాన్న సీఎం…చెరువు కట్టలు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీన పడ్డాయని, వీటిపై దృష్టిపెట్టాలని అన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఫ్లడ్ మాన్యువల్ ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. విపత్తులు వచ్చినప్పుడే పనితీరు, సమర్థత బయటపడుతుందని…వర్షాల నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా, డైనమిక్ గా పనిచేయాలన్నారు. వర్షాలు, వరదలు వచ్చిన తరువాత కాకుండా వాతావరణ శాఖ హెచ్చరికలు, పరిస్థితులను అంచనా వేసి అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టాలను నివారించగలుగుతామని సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో గతంలో ఉన్న వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని…మళ్లీ వాటిని యాక్టివేట్ చేయాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్ లో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.