-ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం నుండి అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చును
-మత్స్య శాఖ అదనపు సంచాలకులు టి. సుమలత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
” టిండాల్ కం డ్రైవర్ ” కోర్సు 73వ బ్యాచ్ లో శిక్షణ పొందుటకు గాను అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నామని మత్స్య శాఖ అదనపు సంచాలకులు టి. సుమలత ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నుండి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తు చేయవచ్చు. శిక్షణ కాలం ది. 01-09-2024 నుండి ప్రారంభం అయి ఒక సంవత్సర కాలం పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆధునిక సాంకేతిక పద్దతులతో యంత్రపు నావ / బోటులో చేపల వేటలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, పూర్తి చేసిన దరఖాస్తు, సంబంధిత సెర్టిఫికెట్ లు నకళ్ళను జత పరిచి ది. 10-08-2024వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తులను ఆయా జిల్లాల మత్స్య శాఖ అధికారి వారి కార్యాలయంలో నేరుగా అందజేయవచ్చునని, లేక పోస్టల్ ద్వారా పంపించవచ్చునని ఆమె తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులు ది. 23-08-2024వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ, జగన్నాధపురం, కాకినాడ-2 కార్యాలయం నందు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. దరఖాస్తు నమూనా మరియు పూర్తి వివరములు కొరకు www.fisheries.ap.gov.in వెబ్ సైట్ నుండి పొందవచ్చునని మత్స్య శాఖ అదనపు సంచాలకులు టి.సుమలత ఒక ప్రకటనలో కోరారు.