Breaking News

మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాలి

– త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డుతూ మ‌రో ప‌దిమందికి ఉపాధిచూపే స్థాయికి చేరాలి
– కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌
– మ‌హిళా సార‌థ్య ప‌రిశ్ర‌మ‌ల‌పై సెర్ప్‌-డీఆర్‌డీఏ ఆధ్వ‌ర్యంలో మేధోమ‌థ‌న స‌ద‌స్సు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదాయ సృష్టితో ఆర్థిక సాధికార‌త దిశ‌గా న‌డిపించే ల‌క్ష్యంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లుచేస్తున్న ప‌థ‌కాల‌ను మ‌హిళ‌లు స‌ద్వినియోగం చేసుకొని పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న సూచించారు.
బుధ‌వారం న‌గ‌రంలోని తుమ్మ‌ల‌ప‌ల్లి వారి క్షేత్ర‌య్య క‌ళాక్షేత్రంలో సెర్ప్‌-డీఆర్‌డీఏ ఆధ్వ‌ర్యంలో మ‌హిళా సార‌థ్య ప‌రిశ్ర‌మ‌ల‌పై సెర్ప్‌-డీఆర్‌డీఏ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటుచేసిన ఎక్స్‌పోను, మేధోమ‌థ‌న స‌ద‌స్సును క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌.. డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస‌రావు, బ్యాంక‌ర్లు, వ్య‌వ‌సాయ‌, అనుబంధ‌రంగాలు, నైపుణ్యాభివృద్ధి త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి ప్రారంభించారు. కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ఉపాధి క‌ల్ప‌న కార్య‌క్ర‌మం (పీఎంఈజీపీ), ప్ర‌ధాన‌మంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి ప‌రిశ్ర‌మ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ ప‌థ‌కం (పీఎంఎఫ్ఎంఈ) త‌దిత‌రాల ద్వారా రాయితీపై రుణాలు పొంది ప్రారంభించేందుకు అందుబాటులో ఉన్న వివిధ వ్యాపార న‌మూనాల‌ను ప్ర‌ద‌ర్శించారు. వ్య‌వ‌సాయ డ్రోన్లు, బిందు సేద్యం స్ప్రింక‌ర్లు, మినీ రైస్ మిల్‌, కేట‌రింగ్ యూనిట్‌, స్వీట్‌షాప్ యూనిట్ వంటి దాదాపు 100 ర‌కాల యంత్రాల‌కు సంబంధించిన స్టాళ్ల‌ను ఏర్పాటుచేసి యూనిట్ వ్య‌యం, బ్యాంకుల ద్వారా ల‌భించే రుణం మొత్తం, రాయితీ మొత్తం త‌దిత‌రాల‌ను స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు వివ‌రించే ఏర్పాట్లు చేశారు.
మేధోమ‌థ‌న సద‌స్సు సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సృజ‌న మాట్లాడుతూ పేద‌రికాన్ని రూపుమాపేందుకు, మ‌హిళ‌ల‌ను ఆర్థిక‌సాధికార‌త దిశ‌గా న‌డిపించి త‌మ కుటుంబాల‌ను ఉన్న‌తంగా తీర్చిదిద్దుకునేందుకు వీలుగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లుచేస్తున్న వివిధ ప‌థ‌కాల‌ను స్వ‌యం స‌హాయ‌క సంఘ మ‌హిళ‌లు ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. స‌మాచారం అనేది చేరాల్సిన వ్య‌క్తికి స‌రిగా చేర‌కుంటే ప‌థ‌కాలు లేదా కార్య‌క్ర‌మాలు పూర్తిస్థాయి ఫ‌లితాలు ఇవ్వ‌వ‌ని.. ఈ నేప‌థ్యంలో అందుబాటులో ఉన్న పథ‌కాలు, వాటికి ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం, యూనిట్ల ఏర్పాటు విధివిధానాలు త‌దిత‌రాల‌పై పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఈ స‌ద‌స్సు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అవ‌కాశాల‌పై స‌రైన అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన బాధ్య‌త త‌మ‌పై ఉంద‌ని.. ఈ దిశ‌గా వివిధ వ్యాపార న‌మూనాల‌ను కూడా ప్ర‌ద‌ర్శించిన‌ట్లు తెలిపారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, స్టాండ‌ప్ ఇండియా త‌దిత‌రాల‌ను ఉప‌యోగించుకొని ఆస‌క్తి ఉన్న యూనిట్‌ను ఏర్పాటుచేసి క్ర‌మ‌శిక్ష‌ణ‌తో వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఎద‌గాల‌ని కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో 10 వేల యూనిట్ల ఏర్పాటు దిశ‌గా అడుగులేస్తున్నామ‌ని.. వీటిలో దాదాపు 5 వేల యూనిట్లు సెర్ప్‌-డీఆర్‌డీఏ ఆధ్వ‌ర్యంలో స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల ద్వారా ఏర్పాటు జ‌రిగేలా ప్రోత్స‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. ప‌థ‌కాల ద్వారా బ్యాంకు రుణాలు పొందే విధానం, ద‌ర‌ఖాస్తు విధానం, స‌మ‌గ్ర ప్రాజెక్టు నివేదిక రూప‌క‌ల్ప‌న త‌దిత‌రాల‌పై ల‌బ్ధిదారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌త్యేక శిబిరాలు నిర్వ‌హించ‌నున్నామ‌ని, అదే విధంగా వ్యాపారాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. వీటిని ఉప‌యోగించుకుంటూ సొంత యూనిట్ల నిర్వ‌హ‌ణ ద్వారా పారిశ్రామిక‌వేత్తలుగా ఎదుగుతూ రాష్ట్రం, దేశాభివృద్దిలో మ‌హిళా శ‌క్తి భాగ‌స్వాములు కావాల‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు.
మేధోమ‌థ‌న స‌ద‌స్సు ల‌క్ష్యాల‌ను డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస‌రావు వివ‌రించారు. అదే విధంగా జిల్లాలోని స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళల పొదుపు, బ్యాంకు లింకేజీ రుణాలు, ఎస్‌హెచ్‌జీల ప్ర‌గ‌తిని ఏపీ సెర్ప్ డీజీఎం (బ్యాంకు లింకేజీ) ఎం.కేశ‌వ కుమార్ పీపీటీ ద్వారా వివ‌రించారు. అదే విధంగా వివిధ శాఖ‌ల అధికారులు త‌మ ప‌రిధిలో అమ‌లవుతున్న ప‌థ‌కాల వివ‌రాల‌ను పీపీటీ ద్వారా ఎస్‌హెచ్‌జీ మ‌హిళ‌ల‌కు వివ‌రించారు. ప‌థ‌కాలు, బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా ఏ విధంగా ఎద‌గొచ్చ‌నే దానిపై బ్యాంక‌ర్లు స‌మావేశంలో మాట్లాడారు. ఇప్ప‌టికే రుణాలు పొంది విజ‌య‌వంతంగా వ్యాపారాలు చేస్తున్న ఇద్ద‌రు మ‌హిళ‌లు త‌మ విజ‌య‌గాథ‌ల‌ను వినిపించారు.
స‌మావేశంలో స్త్రీ నిధి ఎండీ నాంచార‌య్య‌, పీఎంఎఫ్ఎంఈ జెడ్ఎం జ‌నార్థ‌న్‌, వ్య‌వ‌సాయ అధికారి సాకా నాగ‌మ‌ణెమ్మ‌, ప‌శు సంవ‌ర్థ‌క అధికారి డా. కె.విద్యాసాగ‌ర్‌, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్‌, ఏపీ ఎంఐపీ పీడీ పి.ఎం.సుభానీ, నైపుణ్యాభివృద్ధి అధికారి న‌రేష్‌, కేవీఐసీ డైరెక్ట‌ర్ గ్రీప్ త‌దిత‌రుల‌తో పాటు బ్యాంకుల నుంచి యూబీఐ రీజ‌న‌ల్ హెడ్ ఎం.శ్రీధ‌ర్‌, ఎల్‌డీఎం కె.ప్రియాంక‌, ఎస్‌బీఐ ఆర్ఎం (ఉత్త‌ర‌) రాఘ‌వ‌రావు, ఎస్‌బీఐ ఆర్ఎం (ప‌శ్చిమ‌) న‌వీన్‌బాబు, ఇండియ‌న్ బ్యాంక్ జెడ్ఎం రాజేష్‌, ఎస్‌జీబీ ఆర్ఎం జీఎంవీ ప్ర‌సాద్‌, కెన‌రా బ్యాంకు అధికారి కె.వినీత‌, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం స‌తీష్‌, బీవోబీ రీజ‌న‌ల్ హెడ్ చంద‌న్ సాహు, ఆప్కాబ్ జీఎం రంగ‌బాబు త‌దిత‌రులు హాజ‌రయ్యారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *