Breaking News

వంద రోజుల్లో స్నేహపూర్వక పారిశ్రామిక విధానం

-రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య & ఆహార శుద్ది శాఖ మంత్రి టి.జి.భరత్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించి తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రానున్న వంద రోజుల్లో స్నేహపూర్వక పారిశ్రామిక విధానాన్ని రూపొందించనున్నట్లు రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య మరియు ఆహార శుద్ది శాఖ మంత్రి టి.జి.భరత్ తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ నేటి ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమల శాఖ అధికారులతో సుదీర్ఝంగా చర్చించి రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీసుకురావాల్సిన నూతన పాలసీలపై పలు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. గత పదేళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారన్నారు. వచ్చే 100 రోజుల్లో దేశంలోనే ఉత్తమమైన నూతన ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఇ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మరియు ఇండస్ట్రియల్ క్లస్టర్ పాలసీలను తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారన్నారు. వీటికి సంబందించి డ్రాప్టు పాలసీలను రానున్న 15 రోజుల్లో రూపొందించి, ఆ డ్రాప్టు పాలసీలపై స్టేక్ హోల్డర్లు అందరితో పూర్తి స్థాయిలో చర్చించి దేశంలోనే ఉత్తమైన పాలసీలను రూపొందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అపారమైన వనరులు ఉన్నాయని, వాటికి తోడు రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడే పెద్ద బ్రాండ్ అని, ఆయన మీద ఉన్న అపారమైన విశ్వాసంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తాయనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఒకే పాయింట్ లో అన్ని అనుమతులు మంజూరు చేసే విధానాన్ని కూడా అమల్లోకి తేనున్నామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి దగ్గర్లో ఉన్న కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో తమ ప్రభుత్వ హయాంలో ఎకరం రూ.8 నుండి 16 లక్షల వరకూ ఉంటే, గత ప్రభుత్వం ఆ ధరను రూ.85 నుండి 90 లక్షల వరకూ పెంచడం జరిగిందన్నారు. ఈ పారిశ్రామిక వాడలో భూముల రేట్లు తగ్గించి, పెట్టుబడులకు ఊతం ఇవ్వాలని ముఖ్యమంత్రి అదేశించారని, అందుకు తగ్గట్టుగా కూడా తగు చర్యలు తీసుకుంటామన్నారు.
అదే విధంగా ఇప్పటికే రాష్ట్రంలో ఓర్వకల్లు, కృష్ణపట్నం, ఏపీ బల్క్ డ్రగ్ పార్క్, కొప్పర్తి క్లస్టర్లు ఉన్నాయని, వాటికి అదనంగా నూతనంగా మరో నాలుగు పారిశ్రామిక క్లస్టర్లను కుప్పం, లేపాక్షి సత్యసాయి జిల్లా, శ్రీకాకుళం జిల్లా మూలపేట, ప్రకాశం జిల్లాలోని దొనకొండ లలో అభివృద్ది పర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, రానున్న రోజుల్లో వాటిని కూడా అభివృద్ది పర్చనున్నట్లు తెలిపారు. రానున్న ఏడాదిలో రూ.1350 కోట్లతో చిత్తూరు నోడ్ ను అభివృద్ది పర్చనున్నట్లు తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పిపిపి విధానాన్ని కూడా అమల్లోకి తేనున్నట్లు తెలిపారు. రూ.75 వేల కోట్లు పెట్టుబడులతో బిపిసిఎల్ రాష్ట్రానికి రాబోతున్నదని, అయితే దాన్ని ఎక్కడ పెట్టాలనే విషయాన్ని ముఖ్యమంత్రి 90 రోజుల్లో నిర్ణయించనున్నట్లు తెలిపారు. విన్ ఫాస్ట్ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రికల్ కార్ల పరిశ్రమ పెట్టాలని ముందుకు వచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో తమిళనాడు వెళ్లిపోయారన్నారు. అయితే మా విజ్ఞప్తి మేరకు కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు విన్ ఫాస్ట్ ముందుకు వచ్చిందన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన విషయంలో గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన ఫలితంగా పలు పరిశ్రమలు రాష్ట్రం నుండి తరలిపోయాయన్నారు. రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో దాదాపు రూ.11 లక్షల కోట్లు మేర పెట్టుబడులు పెట్టడం జరిగితే పెద్ద ఎత్తున 2014-19 మద్య కాలంలోనే రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయన్నారు. ఏపిఐఐసి భూముల కేటాయింపు విషయంలో 2014-19 మధ్య కాలంలో 14 వేల ఎకరాలు పరిశ్రమలకు కేటాయించడం, ఆ భూముల్లో పరిశ్రమలను కూడా స్థాపించడం జరిగిందన్నారు. అయితే 2019-24 మద్య కాలంలో 6,700 ఎకరాల భూములను కేటాయిస్తే వాటిలో ఎన్ని పరిశ్రమలు స్థాపించారు అనే విషయంలో ఏమాత్రం స్పష్టత లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు ఏమీ సరిగా స్థాపించడం జరుగలేదని, సింగిల్ విండో విధానం కూడా సక్రమంగా అమలు కాలేదని, అయితే పేపర్ వర్కు బాగా చేయడం వల్లే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెజ్ లో రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచిందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులే స్పష్టంచేశారన్నారు. గత పదేళ్ల కాలంలో ఎం.ఎస్.ఎం.ఇ.లకు ప్రోత్సాహకాలను అందజేసే విషయాన్ని పరిశీలిస్తే 2014-19 మధ్య కాలంలో 66 శాతం మేర ప్రోత్సాహకాలను విడుదల చేయడం జరిగితే, గత ప్రభుత్వ హయాంలో కేవలం 34 శాతం ప్రోత్సాహకాలనే విడుదల చేయడం జరిగిందన్నారు. ఎం.ఎస్.ఎం.ఇ., టెక్సటైల్ రంగాలకు సంభందించి దాదాపు రూ.5 వేల కోట్లు మేర ప్రోత్సాహకాలను చెల్లించాల్సి ఉందని, వచ్చే ఐదేళ్లకు మరో రూ.5 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ ప్రోత్సాహకాలను అన్నింటిని ఏ విధంగా అయినా చెల్లించేందుకు తగు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి బరోసా ఇచ్చారన్నారు.

రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఎన్.యువరాజ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Check Also

కేంద్ర ప్ర‌భుత్వం రూ.1100 కోట్ల వ‌ర‌ద సాయాన్ని త్వ‌ర‌గా అందించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్ షా కు విజ్ఞ‌ప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *