– ఆగస్టు 1న ప్రారంభమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లిపాలు బిడ్డకు ఆరోగ్య ప్రదాయిని అని.. బిడ్డకు తల్లిపాలను మించిన శ్రేయస్కరం మరొకటి లేదని పేర్కొంటూ గురువారం ప్రారంభమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అన్నారు. గురువారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు (ఆగస్టు 1-7) ప్రారంభమైన సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి.సృజన మాట్లాడుతూ అంతరాలను పూరించి తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దాం.. ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయని వివరించారు. తల్లిపాల వారోత్సవాల ఔన్నత్యాన్ని తెలియజేయడం, తల్లిపాలు ఇవ్వడంలో అపోహలను తొలగించడం, క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశాలు ప్రత్యేక సెషన్లతో అవగాహన కల్పించడం, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాల నిర్వహణ, 2కే ర్యాలీలు, గృహ సందర్శనలు, ర్యాలీలు వంటివి ఈ వారోత్సవాల సందర్భంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు జరుగుతాయన్నారు. ఆసుపత్రుల్లో బాలింతలకు, గర్భిణీలకు తల్లిపాలపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని.. తల్లిపాలలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందన్నారు. తల్లిపాల విశిష్టతను చాటిచెప్పి, పుట్టిన నాటినుంచే చిన్నారులకు తల్లిపాలను అందించేలా మహిళలను చైతన్యవంతులుగా చేసేందుకు జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిడ్డల శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. తల్లిపాలలో పోషకాలు పిల్లల్ని అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్ల బారినుంచి కాపాడతాయన్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి శారీరక, మానసిక స్థితిని అర్థం చేసుకొని భర్త, కుటుంబ సభ్యులు ఆమెకు తోడుగా నిలవాలని కలెక్టర్ సృజన పిలుపునిచ్చారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో జరిగే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు విజయవంతమయ్యేలా జిల్లా మహిళాభివృద్ధి, శుశు సంక్షేమ అధికారిణి జి.ఉమాదేవి కృషిచేస్తున్నారు.