Breaking News

డిమాండ్ కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి చేయండి

-జెన్ కో అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశం
-శ్రీశైలంలో హైడెల్ విద్యుత్ కేంద్రం సందర్శన అనంతరం అధికారులతో మంత్రి సమీక్ష

శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశైలం హైడెల్ పపర్ ప్రాజెక్టు ద్వారా డిమాండ్ కు తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునే సౌలభ్యం ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. అనంతరం కుడి హైడెల్ పవర్ కేంద్రాన్ని సందర్శించి జన్కో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఒక్క జులై నెలలోనే 100 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని అధికారులు వివరించారు. 7 యూనిట్ల ద్వారా రోజుకు ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అవుతోందని అధికారులను అడగ్గా….7 యూనిట్ల ద్వారా రోజుకు 15 నుండి 16 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని వివరించారు. ఆగస్టులో 250 మిలియన్ యూనిట్లు ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకున్నామని…వరద ప్రవాహం ఇలాగే కొనసాగినట్లయితే 300 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున ఉత్పత్తిని అనుకున్న స్థాయిలో పెంచాలని మంత్రి సూచించారు. కరెంట్ కోతలు లేని ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని.. ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచడం పై దృష్టి సారించాలని అధికారులకు వివరించారు.

చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన మన ప్రభుత్వం రెన్యూబల్ ఎనర్జీకి కీలక ప్రాధాన్యం ఇస్తుందని సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు. 2014-2019 మధ్య కాలంలో మిగలు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎలా అవతరించిందో అదే విధంగా మరోసారి ముందడుగు వేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో ఎపీజెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, డైరెక్టర్ సుజయ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *