అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 5, 6 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో కలక్టర్ల సమావేశాన్ని నిర్వహించనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లండించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయంలో సిసిఎల్ఏ జి.జయలక్ష్మితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ ఈనెల 5, 6 తేదీల్లో జిల్లా కలక్టర్ల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని మొదటి రోజు కలక్టర్లతోను, రెండవ రోజు కలక్టర్లు, ఎస్పిలతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. 5వతేదీ ఉదయం 10గం.ల నుండి 11 గం.ల వరకూ కలక్టర్ల సమావేశ ప్రారంభోత్సవ (Inaugural) కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రెండు రోజుల్లోను ఉదయం 10గం.ల నుండి సా.6గం.ల వరకూ కలక్టర్ల సమావేశం ఉంటుందని స్పెషల్ సిఎస్ సిసోడియా పేర్కొన్నారు.
జిల్లా కలక్టర్ల సమావేశానికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకు స్పెషల్ సిఎస్ ఆర్పి సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి హాజరయ్యే కలక్టర్లు, ఎస్పిలకు తగిన రవాణా,వసతి వంటి ఏర్పాట్లు చూడాలని ఎన్టిఆర్ జిల్లా కలక్టర్ సృజనను ఆదేశించారు. అలాగే కలక్టర్ల సమావేశం నిర్వహణకు అవసరమైన వివిధ సహాయ సిబ్బందిని సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. అదే విధంగా భద్రత,అగ్నిమాపక సంబంధిత భద్రతా చర్యలను గుంటూరు రేంజి ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి, సచివాలయ ఎస్పిఎఫ్ అధికారులు చూడాలని చెప్పారు. కలక్టర్ల సమావేశానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులకు ఆహ్వానాలు పంపే ఏర్పాట్లను సాధారణ పరిపాలన శాఖ చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా చెప్పారు. అదే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఆడియో వీడియో సిస్టమ్,మీడియా కవరేజ్, మినిట్స్ రికార్డు వంటి అంశాలకు సంబంధించి ఐటి అండ్ సి, ప్రణాళిక,ఐ అండ్ పిఆర్, సిఆర్డిఏ విభాగాల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సిసోడియా ఆదేశించారు.
ఈ సన్నాహక సమావేశంలో సిసిఎల్ఏ జి.జయలక్ష్మి, అదనపు సిసిఎల్ఏ ఎన్.ప్రభాకర్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి, గుంటూరు జిల్లా కలక్టర్ నాగలక్ష్మి, ఎన్టిఆర్ జిల్లా కలక్టర్ సృజన,ప్రణాళికా శాఖ డైరెక్టర్ ఆర్.రాంబాబు, సిఆర్డిఏ అదనపు కార్యదర్శి శివరామ కృష్ణ, జిఏడి డిప్యూటీ సెక్రటరీ రామసుబ్బయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …