-మరోసారి ఇంటింటి సర్వే చేయాలని ఆదేశం
-నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
-మెడికల్ ఆఫీసర్లు, ఎఎన్ఎం లకు షోకాజ్ నోటీసివ్వాలని డిఎంహెచ్వోకు ఆదేశం
-15 రోజుల్లోగా పరిస్థితుల్ని చక్కదిద్దాలని స్పష్టం చేసిన కమీషనర్
-ఉండవల్లి సెంటర్లో డ్రైడే ఫ్రైడేని పరిశీలించిన
-ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఇంట్లోనూ ఫ్రై డే-డ్రైడే తప్పనిసరిగా పాటిస్తే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దరి చేరవని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ అన్నారు. తాడేపల్లి పీహెచ్సీ పరిధి, ఉండవల్లి సెంటర్ ప్రాంతంలోని వాటర్ ట్యాంక్ రోడ్, కెయల్ రావు నగర్ లలో డ్రైడే -ఫ్రైడే అమలు తీరును ఆయన శుక్రవారం నాడు పరిశీలించారు. పరిసర ప్రాంతాలు, ఇళ్లను ఆయన పరిశీలించారు. ఇళ్లల్లో, బయటా నీటి నిల్వ ఉన్న ప్రదేశాల్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతనెల 25న ఈ ప్రాంతంలో డెంగ్యూ పాజిటివ్ కేసు వచ్చిందని, తాడేపల్లి పిహెచ్‌సి డాక్టర్లు పరీక్ష చేశాక ఆ వ్యక్తి నిమంగళగిరి ఎయిమ్స్ కు రిఫర్ చేశారని, అక్కడి డాక్టర్లు ఇచ్చిన మందులు వాడడంతో ఆ పేషంట్ కోలుకున్నారని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. మెడికల్ ఆఫీసర్లు, ఎఎన్ ఎంలు, ఆశాలు డ్రైడే ఫ్రైడే ని పాటిస్తున్నదీ లేనిదీ పర్యవేక్షించాల్సిన బాధ్యత డిఎంహెచ్వోదేనని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మెడికల్ ఆఫీసర్, ఎఎన్ఎంలకు షోకాజ్ నోటీసులివ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మిని కమీషనర్ ఆదేశించారు. 15 రోజుల్లోగా పరిస్థితుల్ని చక్కదిద్దాలన్నారు. డెంగ్యూ పాజిటవ్ కేసు వచ్చిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై తక్షణ చర్యల్ని చేపట్టిందన్నారు. ఎక్కడైనా ఒక పాజిటివ్ కేసొస్తే చుట్టుపక్కల వారిని టెస్ట్ చేయడం ద్వారా మిగతా వారిని రక్షించేందుకు వీలు కలుగుతుందన్నారు. పీహెచ్సీలు, సబ్ సెంటర్లకొచ్చిన వారిని కూడా టెస్ట్ చేస్తారన్నారు. ఈ ప్రాంతంలో డెంగ్యూ పాజిటివ్ రావడంతో చుట్టు పక్కల ఇళ్లను సర్వే చేయాలని ఆదేశించామనీ, తద్వారా మిగతా ఇళ్లల్లో దోమల లార్వాలు పెరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఇళ్లల్లోకెళ్లి తాను స్వయంగా నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్ని చూశానని, దోమల లార్వాలు అందులో ఉండడాన్ని గమనించానని తెలిపారు. పాతకాలంనాటి ఫ్రిజ్‌ల కింద నీరు నిల్వ ఉండడం గమనించానన్నారు. కొన్ని రోజుల పాటు ఇళ్లు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి ఇంటికొచ్చాక నీటి నిల్వల్ని వెంటనే తొలగించి ఆ ప్రదేశం పొడిగా ఉంచుకోవాలన్నారు. లేని పక్షంలో నిల్వ నీటిలో దోమల లార్వాలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదమేర్పడుతుందని కమీషనర్ పేర్కొన్నారు. ఎఎన్ఎంలు, ఆశాలు ఇంటింటికీ వెళ్లి డ్రైడే ఫ్రైడే గురించి ప్రజలకు చెప్పాలన్నారు. రోజువారీ శానిటేషన్ తో పాటు మునిసిపల్, పంచాయతీరాజ్ విభాగాలు కూడా వైద్య ఆరోగ్య శాఖతో కలిసి పనిచేస్తే చాలా వరకు వ్యాధులు ప్రబలకుండా అరికట్టవచ్చన్నారు. ఈ ప్రాంతాల్లో మరోసారి ఇంటింటి సర్వే చేయాలని ఆదేశించామన్నారు. ఇంటిలోపలా, బయటా పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు ప్రబలే అవకాశాలుండవన్నారు. టెస్ట్‌ల సంఖ్యను కూడా పెంచామన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన వెంటనే సర్వెలెన్స్‌ను చేపడతామనీ, తద్వారా కేసుల పెరగకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశముంటుందని కమీషనర్ చెప్పారు. వ్యాధులు ప్రబల కుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, వైద్య ఆరోగ్య శాఖ కూడా మరింత అప్రమత్తంగా ఉంటుందనీ స్పష్టం చేశారు. డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రమణ్యేశ్వరి, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి , తాడేపల్లి మునిసిపల్ కమీషనర్ అలీంబాషా, గుంటూరు జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయన్ తదితరులు కమీషనర్ వెంట ఉన్నారు.