Breaking News

నూతన జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వరం

-బట్టీ విధానానికి స్వస్తి.. సృజనాత్మకత పెంపొందించడం, ప్రతి ఒక్కరూ చదువుకునేలా చేయడం నూతన విద్యా విధానం ప్రధాన ఉద్దేశం
-విద్యార్థి దశలోనే నైపుణ్య శిక్షణ, తద్వారా స్వయం ఉపాధితోపాటు చదువుకునే వెసులుబాటు
-భారతదేశ అభివృద్ధిలో నూతన జాతీయ విద్యా విధానం పాలసీది కీలక పాత్ర
-కొత్త విద్యా విధానం అమల్లో కొన్ని సమస్యలు, సవాళ్లు ఉన్న మాట వాస్తవమే.. అధిగమిస్తాం
-గత పాలకులు సరైన విద్యా విధానం, ఆర్థిక విధానం తీసుకురావడంలో విఫలం
-గత ఐదేళ్లల్లో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైన మాట వాస్తవం
-దేశాన్ని అన్ని రంగాల్లోనూ సమున్నత స్థానానికి తీసుకెళ్లే లక్ష్యంగా గౌరవ ప్రధాని ప్రారంభించిన గొప్ప కార్యక్రమాల్లో ‘జాతీయ విద్యా విధానం–2020’ ఒకటి
-‘ఉన్నత విద్యాసంస్థల్లో జాతీయ విద్యా విధానం‌‌–2020 అమలు, సవాళ్లు’ అనే అంశంపై అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహాసంఘ్, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆధ్యర్యంలో నిర్వహించిన సెమినార్ లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ వెల్లడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“నూతన జాతీయ విద్యా విధానం -2020” ఉపాధ్యాయులు, విద్యార్థులకు వరం లాంటిదని, ఈ విధానం విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. ‘ఉన్నత విద్యాసంస్థల్లో జాతీయ విద్యా విధానం‌‌–2020 అమలు, సవాళ్లు’ అనే అంశంపై అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహాసంఘ్, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ శనివారం సంయుక్తంగా నిర్వహించిన రెండు రోజుల సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని అన్ని రంగాల్లోనూ సమున్నత స్థానానికి తీసుకెళ్లే లక్ష్యంగా గౌరవ ప్రధాన మంత్రి శ్రీ. నరేంద్ర మోదీ ప్రారంభించిన గొప్ప కార్యక్రమాల్లో ‘జాతీయ విద్యా విధానం–2020’ ఒకటని పేర్కొన్నారు. బట్టీ విధానానికి స్వస్తి పలికి సృజనాత్మకత పెంపొందించడం, ప్రతి ఒక్కరూ చదువుకునేలా చేయడం నూతన విద్యావిధానం ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యార్థి దశలోనే నైపుణ్య శిక్షణ, తద్వారా స్వయం ఉపాధితోపాటు చదువుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఏ దేశంలో అయినా విద్యాభివృద్ధి ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇది సాకారమవ్వాలంటే భారతీయ విలువలతో కూడిన విద్యావిధానం అవసరమని పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానం–2020 అచ్చంగా అలాంటిదే అని అభివర్ణించారు. ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఆర్ధిక పరిస్థితులు, ఇతర ఇబ్బందులు ఉన్నవారికి కూడా ఈ నూతన విద్యా విధానం ద్వారా ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. ఎనిమిదో తరగతి నుంచి ఇతర దేశాల భాషలు నేర్చుకునే అవకాశం కూడా నూతన విద్యా విధానంలో ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నూతన విద్యా విధానంలో వచ్చిన ఫలితాలు కేంద్రం వల్లే అని తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత కారణంగా మంచి ఉద్యోగాలు సాధించే అవకాశాలు పెరిగాయన్నారు. ఈ విధానం వల్ల భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుందన్నారు. కష్ట తరమైన విద్య నుంచి నూతన టెక్నాలజీ పరిజ్ఞానంతో ఉండే విద్యా విధానం అందుబాటులోకి రావటం వల్ల విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భారతదేశం అభివృద్ధిలో ఈ నూతన జాతీయ విద్యా విధానం పాలసీది కీలక పాత్ర అన్నారు. నూతన విద్యా విధానం అమల్లో కొన్ని సమస్యలు, సవాళ్లు ఉన్న మాట వాస్తవమేనని సత్యకుమార్ తెలిపారు. వాటిని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రం తెచ్చిన ఈ కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రాలు ఆమోదించడమే మొట్టమొదటి సవాల్ గా మంత్రి సత్య కుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. విద్య కోసం రాష్ట్రాలు తమ వంతు బాధ్యతగా ఖర్చు చేయాల్సి ఉంటుందని, వీటిని అధిగమిస్తే నూతన విద్యావిధానం ఒక సరికొత్త ఒరవడి సృష్టిస్తుందని భావిస్తున్నానన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 29 జాతీయ విద్యా సంస్థలను కేంద్రం ఇచ్చిందన్నారు.

భారతీయ విలువను జోడించి, కొత్త విద్యా విధానం అమలు చేయాలన్నారు. సమస్యలను, అవరోధాలను అధిగమించి ముందుకు సాగేలా విద్యా విధానం ఉండాలని సూచించారు. విద్యా విధానం సమగ్రంగా ఉండాలని, విద్యార్థిలో సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఉండాలి అన్నారు. గతంలో ఉన్న విద్యావవస్థల ద్వారా ఇతరదేశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి ఉండేదన్నారు. కొన్నేళ్ల పాటు ఉపాధి కోసమే కాదు విద్య కోసం వలసలు పోయారని తెలిపారు. గత పాలకులు సరైన విద్యా విధానం, ఆర్ధిక విధానం తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినందువల్ల తాను ఇంజనీరింగ్ పూర్తి చేయలేక పోయానని మంత్రి గుర్తు చేసుకున్నారు.

అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటే సాధ్యం కాదని, ప్రైవేటు సంస్థలలో రాణించాలంటే నైపుణ్య శిక్షణ చాలా అవసరమని సూచించారు. భాష ఏదైనా మాతృభాషను మరిచిపోవద్దన్నారు. మాతృభాషతోనే రాణించిన దేశాలున్నాయన్నారు. ఉదాహరణకు చైనా, జపాన్ లు పారిశ్రామికంగా ఎలా ఎదుగుతున్నారో పరిశీలించాలన్నారు. ప్రాథమిక విద్య మొత్తం మాతృ భాషలో ఉంటేనే వారిలో సృజనాత్మకత బయటకు వస్తుందన్నారు. అన్ని దేశాల్లో ఇది అమలవుతున్నా.. మన దేశంలో మాత్రం పర భాషపై మోజు పెరిగిందన్నారు. సెమినార్ కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రావాల్సి ఉన్నప్పటికీ మరో అత్యవసర సమావేశం వల్ల రాలేకపోయారని మంత్రి తెలిపారు.

గత ఐదేళ్లల్లో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఇలా చేస్తే ఇక విద్యా విధానం ఎలా మెరుగు పడుతుందని ప్రశ్నించారు. విద్యాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేర నిధులు ఇస్తున్నాయో ఆలోచించాలన్నారు. విద్యార్థుల కోసం కేంద్రంతో పాటు, రాష్ట్రాలు కూడా ముందుకు రావాలని కోరారు. గతంలో భారతీయ విద్యా విధానం ఉంటే దాన్ని రూపుమాపి గత పాలకులు బ్రిటీష్ విద్యను అమలు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు అన్యాయం జరిగిందన్నారు. ఇదే బానిస ఆలోచనలతో కొనసాగితే భారత యువశక్తి ని ఉపయోగించుకునే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. నేడు మన దేశం ఆర్ధిక వ్యవస్థగా ఎదిగి అగ్ర దేశాలకు ధీటుగా నిలుస్తుందన్నారు.

మనదేశంలో ఒక మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ లు సృష్టించాలంటే టెక్నాలజీ లాంటి విద్య అవసమరని అభిప్రాయపడ్డారు. భారతీయ విలువలతో కూడిన విద్యా విధానం లేకపోవటం తోనే దేశం భ్రష్టు పట్టిందన్నారు. దీన్ దయాల్ లాంటి కార్యక్రమాలతో లోకల్ తయారీ విధానానికి స్వాగతం పలికామన్నారు. సౌత్ కొరియా, అమెరికా లాంటి దేశాలలో విద్య పై ఎక్కువ ఖర్చు పెడుతున్నారని వివరించారు. మన దేశంలో కూడా విద్య పై ఎక్కువ ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతాయన్నారు. చాలా రాష్ట్రాలు విద్య పై ఖర్చు పెడితే మెరుగైన వసతులు, మెరుగైన విద్యని అందించగలగుతామన్నారు. విద్యార్థుల్లో నైపుణ్య శిక్షణ కల్పించేందుకు అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వక్తలు సైతం నూతన విద్యావిధానంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా రెండు రోజులు పాటు నూతన విద్యావేత్తలు అందరూ కలిసి ఒక వేదికపైకి వచ్చి జాతీయ విద్యా విధానం -2020పై చర్చించడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. నూతన విద్యా విధానం గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసి, అమలయ్యేలా చూడాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానన్నారు.

సెమినార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ శ్రీకొండ రమేష్, ముఖ్య ఉపన్యాసకులుగా నేషనల్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంతా లక్ష్మణ్, విశిష్ట అతిథులుగా, యూనివర్సిటీ నిధుల సంఘం(యూజీసీ), ఢిల్లీ జాయింట్ సెక్రెటరీ, అవిచల్ రాజ్ కపూర్ మరియు సిద్ధార్థ అకాడెమీ అకాడమిక్ అడ్వైసర్ నార్ల వినయ్ కుమార్, అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహాసంఘ్ సభ్యులు, అధ్యాపకులు, ఫ్రొపెసర్లు, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *