Breaking News

డిజిటల్ మార్కెటింగ్ తో అధిక ఆదాయం

-సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన అవసరం
– జిల్లా కలెక్టర్

పెడన నేటి పత్రిక ప్రజావార్త :
ఈ కామర్స్ మార్కెటింగ్ తో చేనేత వస్త్రాలను విక్రయించడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని, అందుకు తగిన రీతిలో ఆయా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవమును పురస్కరించుకొని జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో  పెడన పట్టణంలోని పోలవరపుపేట, శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవాంగ ప్రార్థన మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ చేనేత కళాకారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకప్పుడు వస్త్ర పరిశ్రమలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, అయితే నాటి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుంచి పత్తి, ఇతర ముడి సరుకులను ఇంగ్లాండ్ కు తరలించి, అక్కడ తయారైన వస్త్రాలను ఇక్కడకు దిగుమతి చేసుకొని మనకు అమ్మేవారని, జాతిపిత మహాత్మా గాంధీ దీనిని వ్యతిరేకించి స్వదేశీ ఉద్యమంతో స్వదేశీ వస్త్రాల ప్రాముఖ్యతను తెలియజేశారని నాటి చరిత్రను గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో చేనేత కార్మికులు నాణ్యమైన వస్త్రాలను తయారు చేస్తున్నప్పటికీ వాటిని మార్కెట్లో అమ్ముకోవడం కీలక అంశంగా మారిందన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసుకోకుండానే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్ర వంటి వెబ్ సైట్ల ఈ కామర్స్ మార్కెటింగ్ తరహాలో ఇక్కడ తయారు చేసిన వస్త్రాలను ఆన్లైన్ ఆర్డర్ ద్వారా ఇతర దేశాలకు అమ్మకాలు చేసే విధంగా వినూత్నంగా ఆలోచించాలని సూచించారు. ఈ క్రమంలో సమాజ అభిరుచికి తగ్గట్టుగా నూతన డిజైన్లతో వస్త్రాలను తయారు చేసే విధంగా చేనేత కార్మికులకు శిక్షణ తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ చేనేత ఉత్పత్తుల వినియోగం, చేనేత కార్మికులను ప్రోత్సహించడంలో భాగంగా జాతీయ చేనేత దినోత్సవంను జరుపుకుంటున్నట్లు తెలిపారు. దీనిని వారసత్వంగా ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేత సహకార సంఘాలకు అన్ని బకాయిలను చెల్లించిందని, తర్వాత వచ్చిన ప్రభుత్వం సబ్సిడీ పథకాలను నిలుపుదల చేసి చేనేత కార్మికులను పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమ అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రస్తుత బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బందరు ఆర్టీవో ఎం వాణి, మాజీ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి గురుమూర్తి, విఘ్నేశ్వర సొసైటీ మాజీ అధ్యక్షుడు యడ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *