-జూనియర్ కళాశాల కి ఎమ్మెల్యే సుజనా వరాల జల్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ లోని ప్రభుత్వ కళాశాలలను కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్ది ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ తరగతుల అభివృద్ధికి కృషి చేస్తానని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. గురువారం 45వ డివిజన్ కబేళా ప్రాంతంలోని, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విచ్చేసి విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేశారు. అనంతరం డిఐఈఓ సిఎస్ఎస్ఎన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ షేక్ అహ్మద్, మరియు, అధ్యాపకులతో ముఖాముఖి చర్చించి కళాశాల బాగోగులు అడిగి తెలుసుకున్నారు.200 మంది విద్యార్థులు ఉన్న కళాశాలలో అధునాతన ల్యాబ్ సౌకర్యం, ఫర్నిచర్, మరియు అదనపు తరగతులను నిర్మించి కళాశాల అభివృద్ధికి సహకరించాలని ప్రిన్సిపల్ షేక్ అహ్మద్, డిఐఈఓ రెడ్డి,సుజనాకు విజ్ఞప్తి చేశారు. కళాశాలను పరిశీలించిన అనంతరం మౌలిక సదుపాయాల కల్పన, తరగతి భవనాల నిర్మాణానికి చర్యలు, ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ తరగతుల ఏర్పాటుకు కృషిచేసి విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనాన్ని కూడ అందించి కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ కళాశాలను అభివృద్ధి చేస్తానని సుజనా హామీ ఇచ్చారు. సాధ్యసాద్యాలను పరిశీలించి ,నెలలోపు మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని తక్షణమే తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ విద్ధ్యోన్నతి పథకం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులందరికీ అండగా ఉన్నారన్నారు. విద్యార్థులకు మంచి విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం, మొదలైన సౌకర్యాలు కల్పించడం ద్వారా భావితరాలు ఆరోగ్యంగా ఉన్నతంగా ఉంటాయన్నారు. ఎన్డీయేకూటమి విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని తెలియజేశారు.విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అడిగిన వెంటనే జూనియర్ ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి వరాల జల్లు కురిపించిన సుజనాకు అధ్యాపకులు విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, బిజెపి మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ ,టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి ఎమ్మెస్ బేగ్, జనసేన నాయకులు బొమ్ము గోవింద లక్ష్మి, తిరుపతి అనూష, తిరుపతి సురేష్,మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, పగడాల కృష్ణ, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.