మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, దీనిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ (పిసిపిఎన్డిటి) చట్టంపై జిల్లాస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పదవ అదనపు జిల్లా జడ్జి ఎస్ చినబాబుతో కలసి స్కానింగ్ కేంద్రాల దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించి అధికారుల నుండి వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం పట్ల సమాచారం ఉన్న జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలలో నిఘా ఉంచాలన్నారు. తనిఖీ టీములను ఏర్పాటు చేసి వారి ద్వారా తనిఖీలు నిర్వహించి చట్టాన్ని అతిక్రమించిన వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పదవ అదనపు జిల్లా జడ్జి ఎస్ చినబాబు మాట్లాడుతూ జనాభాలో స్త్రీ పురుష లింగ నిష్పత్తులలో వ్యత్యాసం లేకుండా ప్రజలలో క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 87 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని, ప్రస్తుతం కొత్తగా స్కానింగ్ రిజిస్ట్రేషన్ కోసం రెండు కేంద్రాలు, రెన్యువల్ కోసం ఐదు కేంద్రాలు, సవరణ (మోడిఫికేషన్) నిమిత్తం ఏడు కేంద్రాలు, క్యాన్సిలేషన్ కోసం నాలుగు కేంద్రాలు దరఖాస్తు చేసుకున్నారని డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి గీతాబాయి వివరించారు.
ఈ సమావేశంలో ఏఎస్పి ప్రసాద్, గైనకాలజిస్ట్ ఎంకెవి లక్ష్మి కుమారి, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యురాలు కారెడ్ల సుశీల తదితరులు పాల్గొన్నారు.