తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగష్టు 16వ తేదీ శుక్రవారం వరలక్ష్ష్మీ వ్రతం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరుగనుంది. వ్రతం నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్రతం కారణంగా అమ్మవారి ఆలయంలో ఆర్జితసేవలైన అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
మహామంగళ దేవత, లక్ష్మీ అవతారమైన అలమేలు మంగమ్మ తిరుచానూరు ఆలయంలో జగత్కల్యాణం కోసం అవతరించిన సౌభాగ్యదేవత. తిరుచానూరులో చేసే వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న భక్తులకు విశేషమైన ఫలాలు చేకూరుతాయి. వ్రతం చేసే రోజున ఉదయాన్నే మంగళ స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి ఆలయంలో అర్చకులు ఏర్పాటుచేసిన మంటపంలో కొలువైన వరలక్ష్మీ దేవిని దర్శించాలి. అర్చకులు మంటపంలో ముగ్గులలో కమలాన్ని ఏర్పాటు చేస్తారు. దాని మధ్యలో కలశాన్ని ఉంచి, దానిపై నారికేళ ఫలాన్ని పెట్టి, దానికి చెవులు, కన్నులు, ముక్కు ఏర్పాటుచేసి ఆభరణాలను అలంకరిస్తారు. లక్ష్మీమాతను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఆవాహనం చేసి షోడశోపచార పూజలు చేస్తారు. రక్ష కట్టిన తరువాత పసుపు, కుంకుమ, పూలతో వ్రతాన్ని సుసంపన్నం గావించి, వ్రతమహత్యం కథను కూడా చక్కగా పఠించడం జరుగుతుంది.