-పూర్తి అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ
-ఎయిడ్స్ నుండి రక్షణకు క్రమశిక్షణా జీవితమే మార్గం..
-జిల్లా కలెక్టర్ డా. జి. సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎయిడ్స్ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పించి వ్యాధిని నివారించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని క్రమశిక్షణా జీవితమే ఎయిడ్స్ వ్యాధి రక్షణకు ఏకైక మార్గమని, వ్యాధి బారిన పడిన వారి పట్ల వివక్షత చూపకుండా మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన అన్నారు.
నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం మొగల్రాజపురం సిద్ధార్థ ఆర్డ్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన హెచ్‌ఐవి అండ్ ఎస్‌టిఐ (సెక్స్‌వల్లీ ట్రాన్స్‌మీటెడ్ ఇన్‌ఫెక్షన్స్) అవగాహనలో భాగంగా ‘‘మీకు తెలుసా’’ ఇంటెన్సిఫైడ్ కాంపెయిన్‌ను జిల్లా కలెక్టర్ జి. సృజన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారిగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాల ద్వారా ఎయిడ్స్ మహ్మమారి భూతం అనే భయం పోగొట్టి ప్రజల్లో ధైర్యం కల్పించడం ద్వారా వ్యాధిగ్రస్తుల కేసుల సంఖ్యను దాదాపు 86 శాతం తగ్గించడం జరిగిందన్నారు. ప్రజలలో మరింత అవగాహన కల్పించడం ద్వారానే ఎయిడ్స్ వ్యాధిని పూర్తి స్థాయిలో అరికట్టగలుగుతామన్నారు. గతంలో ‘‘పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందా?’’ అనే ఒక్క నినాదం ప్రజలను ఎంతో ఆలోచింప చేయగలిగిందన్నారు. నేటి ‘‘మీకు తెలుసా’’ కాంపెయిన్ ద్వారా ఎయిడ్స్ వ్యాధి ఏవిధంగా వ్యాపిస్తుంది, నివారణ మార్గాలు, వ్యాధి పరీక్షలు నిర్వహించుకోవడం, వైద్య సేవలు పొందడం, కండోమ్ వాడకం, వ్యాధి నివారణ పై చర్చాగోష్టులు నిర్వహించడం, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా ఉండడం, టోల్ ఫ్రీ నెంబర్ 1097 ద్వారా సహకారం పొందడం, వైరల్‌లోడ్ తగ్గించడం వంటి అంశాలను మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక ప్రచార పద్దతుల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో ముఖ్యంగా ప్రజలు క్రమశిక్షణ జీవితాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. చెడు వ్యసనాలు, విచ్చలవిడి శృంగారానికి పాల్పడడం వంటి వాటికి దూరంగా ఉండడం ఉత్తమమైన మార్గం అని జిల్లా కలెక్టర్ జి. సృజన అన్నారు. స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ జాయింట్ డైరెక్టర్ డా. కామేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పూర్తి స్థాయిలో నివారించేందుకు ‘‘మీకు తెలుసా’’ ఇంటెన్సిఫైడ్ కాంపెయిన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వారం ఒక ‘‘థీమ్’’ను తీసుకుని ఎనిమిది వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. 2023`24 సంవత్సరంలో ఎయిడ్స్ వ్యాధి మరణాల రేటును 76.04 శాతానికి తగ్గించగలిగామని, అవగాహన సదస్సుల ద్వారా 90 శాతం మరణాలను అరికట్టడంతో పాటు నూరు శాతం ఎయిడ్స్ నివారించాలన్నదే లక్ష్యమన్నారు. వ్యాధి బారిన పడిన వ్యాధిగ్రస్తులకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని, మందులను అందించడంతో పాటు మానసిక ధైర్యాన్ని కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. సృజన ఇంటెన్సిఫైడ్ కాంపెయిన్‌ను సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఎయిడ్స్ వ్యాధి అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా భాధ్యత కలిగిన పౌరునిగా పరిపూర్ణ చైతన్యంతో మానవతా వాధిగా ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తానని… మనసా వాచా కర్మణతో అన్ని విషయాలలో ముందుంటానని.. నాతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటివారు మీకు తెలుసా కార్యక్రమంలో భాగస్తామ్యులు అయ్యేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. కెఎల్ యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన న్యత్యాలు అహుతులను ఆలరించాయి.
కార్యక్రమంలో స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ జాయింట్ డైరెక్టర్లు డా. కామేశ్వర ప్రసాద్, డా. మంజుల, డా. భాగ్యలక్ష్మి, అడిషనల్ డైరెక్టర్ డా. సరస్వతి దేవి, కో`ఆర్డినేటర్ డా. రాజేంద్రప్రసాద్ , డియంఅండ్ హెచ్‌వో యం. సుహసిని, ఎయిడ్స్ కంట్రోల్ జిల్లా అధికారిణి డా. జి. ఉషారాణి, నెహ్రు యువ కేంద్ర జిల్లా కో`ఆర్డినేటర్ ఎస్ రామ్, యువజన సర్వీసుల శాఖ జిల్లా మేనేజర్ సుబ్బారావు, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కో`ఆర్డినేటర్ అరవ రమేష్ పాల్గొన్నారు.