-జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పక్కాగా ఏర్పాట్లు చేసి ఘనంగా నిర్వహిద్దామని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. నేటి సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు డిఆర్ఓ పెంచల కిషోర్ తో కలిసి ఈ నెల ఆగస్ట్ 15న నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి అధికారులతో సమన్వయ సమావేశము నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఈ నెల ఆగస్ట్ 15న పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమ ఏర్పాట్ల పూర్తి పర్యవేక్షణ ఆర్డీఓ చేయాలని సూచించారు. పెరేడ్ గ్రౌండ్ నందు బందోబస్తు, జెండా వందనం, వేదిక అలంకరణను, కవాతు ఏర్పాట్లను పోలీస్ శాఖ, తుడా వారు వివిధ అంశాల సమన్వయంతో ఏర్పాట్లు ఉండాలని సూచించారు. సీటింగ్ ఏర్పాట్లను అర్బన్ తహశీల్దార్, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ డిఈఓ చూడాలని, ప్రథమ చికిత్స కేంద్రం మరియు అత్యవసర వైద్య సేవల ఏర్పాట్లను డిఎంఅండ్ హెచ్ఓ, పారిశుద్ధ్యం, త్రాగునీరు వసతి ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్, గ్రామీణ నీటి సరఫరా ఎస్.ఈ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై 11 స్టాల్స్ మరియు 7 శకటాలను వివిధ శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని పలు శాఖలు సాధించిన ప్రగతి నివేదిక తయారీ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ను సమాచార శాఖ పర్యవేక్షించాలని తెలిపారు. ఇండిపెండెన్స్ డే ఏర్పాట్ల కొరకు కేటాయించిన పనులను ఎలాంటి లోపాలు లేకుండా సంబంధిత శాఖలు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.