-సీఈఓ వివేక్ యాదవ్
-మార్గదర్శకాల మేరకు ఎస్ఎస్ఆర్ 2025 చేపడతాం: జేసీ శుభం బన్సల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో ఫోటో ఎలెక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 కొరకు బిఎల్ఓ లు వారి పరిధిలోని ఇంటింటి గృహ సందర్శన చేసి పరిశీలించాలని రాష్ట్ర చీఫ్ ఎలెక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. మంగళవారం ఉదయం వెలగపుడి సచివాలయం నుండి అన్ని జిల్లా కలెక్టర్లతో ఎస్ఎస్ఆర్ – 2025 పై, క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పై తదితర అంశాలపై వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డి.ఆర్.ఓ పెంచల కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఈ.ఓ మాట్లాడుతూ ఆగస్టు 20 నుండి బిఎల్ఓ లు ఇంటి ఇంటికీ వెళ్లి గృహ సందర్శన చేసి ఓటర్ల జాబితా పరిశీలించి సదరు వివరాలను ధృవీకరణ చేయాలని జిల్లా కలెక్టర్లు, ఈఆర్ఓ లు, ఎఈఆర్ఓ లకు సక్రమంగా షెడ్యుల్ మేరకు నాణ్యతగా జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఫోటో ఎలెక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ -2025 లో భాగంగా మార్గదర్శకాల మేరకు పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్తీకరణ / పునర్విభజన చేయాలని, ఎన్నికల జాబితా/ ఎపిక్ లో ఏదైనా లోపాలను తొలగించాలని, చిత్ర నాణ్యత మెరుగుపరచడం మరియు పోలింగ్ స్టేషన్ల మరియు సరిహద్దుల ఖారారు వంటి ప్రాథమిక సవరణ కార్యచరణలు చేపట్టాలని తెలిపారు. ఇంటర్, డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు ఫోటో ఎలెక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. హెల్ప్ లైన్ యాప్ గురించి వివరించాలని తెలిపారు. అక్టోబర్ నెల 19 వ తేదీ నుండి 28 అక్టోబర్ వరకు ఫార్మాట్ 1 నుండి 8 వరకు 01.01.2025 నాటికి సంబంధించిన డ్రాఫ్ట్ ఎలెక్టోరల్ రోల్ తయారీ చేయాలని, అలాగే ముసాయిదా ఓటరు జాబితా 29 అక్టోబర్ 2024 నాటికి ప్రచురించాల్సి ఉంటుందని, అలాగే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఏవైనా ఉంటే వాటిని 29 అక్టోబర్ 2024 నుండి 28 నవంబర్ 2024 వరకు ఫైల్ చేయవచ్చునని తెలిపారు. షెడ్యుల్ మేరకు నిర్దేశించబడిన ఎస్ ఎస్ ఆర్ 2025 ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఆ మేరకు చర్యలు చేపడతామని జెసి గారు సిఈఓ కు వివరించారు. ఈ సమావేశంలో ఎస్డిసి రామ్ మోహన్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.