-కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద నవ హారతుల పునరుద్ధరణ
-దసరా ఉత్సవాల నాటికి పవిత్ర సంగమం వద్ద నవ హారతులు సిద్ధం
-ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమం ప్రాంతంను తీర్చిదిద్దుతాం.
-50 ఎకరాల భూమి సేకరించి ఆలయ నిర్మాణం చేస్తాం.
-నదికి ఆవల ఉన్న లంక భూములను కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం.
-రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతాం.
– రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద నవ హారతులను పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఫెర్రీ ఘాట్ సమీపంలోని పవిత్ర సంగమం ప్రాంతంలో నవహారతులను పునరుద్దరించాలన్న సీఎం ఆదేశాలతో మంత్రుల బృందం మంగళవారం పవిత్ర సంగంను పరిశీలించి, అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ నవహారతులను 30 నుండి 45 రోజుల లక్ష్యంగా నిర్ణయించుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు. గత ప్రభుత్వం పవిత్ర సంగమం ప్రాంత విశిష్టతను చెడగొట్టిందన్నారు. నిత్యం ఇక్కడ కృష్ణమ్మకు ఇచ్చే జలహారతులను కూడా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ముందు వరకు హారతులు కొనసాగాయని, నిత్యం వేలాదిమంది హారతి కార్యక్రమానికి హజరయ్యేవారని గుర్తుచేశారు. పవిత్ర సంగమం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేందంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రాంతంలో 50 ఎకరాలు సేకరించి ఒక దేవాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. అలాగే పర్యాటకానికి పెద్ద పీట వేస్తూ అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నదికి ఆవల వైపు ఉన్న లంక భూములను కూడా సేకరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ప్రకాశం బ్యారేజీ నుండి పవిత్ర సంగమం వరకు బోట్ షికార్, స్పీడ్ బోట్ వంటి ఏర్పాట్లు చేయలని సంకల్పించామన్నారు. వైదిక కమిటీ సభ్యులతో చర్చించి ఏ ఆలయం కట్టాలనే దానిపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు. పవిత్ర సంగమం ఎప్పుడూ భక్తులతో, పర్యాటకులతో కిటకిటలాడేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. హరతుల నిర్వహణకు నెలకు రూ. 11 లక్షల వరకు ఖర్చు అవుతుందని దాతల సహాకారం కూడా తీసుకుంటామన్నారు. మరోసారి కమిటీ సభ్యులు సమావేశమై పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు.
పవిత్ర సంగమం ప్రాంతం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని శాఖల సహకారం తీసుకుంటున్నామని, ప్రధానంగా సీఆర్డఏ నుండి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,అర్బన్ డెవలప్ మెంట్ శాఖామాత్యులు పొంగూరు నారాయణ తెలిపారు. ఇతర శాఖలు వారి బడ్జెట్ ప్రకారం నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధటంతో పాటు భక్తులకు, పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పెర్కొన్నారు. కృష్ణమ్మకు ఇచ్చే నవహారతులతో మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని ఆకాంక్షించారు. 2019కి ముందు నిత్యం నవ హారతుల కార్యక్రమం జరిపామని, గత ఐదేళ్ల పాలనలో ఈ కార్యక్రమం నిలిపివేసారని, సీఎం చంద్రబాబు ఆదేశాలతో పునరుద్ధరణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో శానిటేషన్, భక్తుల భద్రత వంటి అంశాలను ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.
పవిత్ర సంగమం ప్రాంతంను రాష్ట్రంలోనే ఐకానిక్ ప్రాంతంగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖామాత్యులు కొలుసు పార్థసారథి అన్నారు. నిత్య హారతులతోపాటు, ఒక ఆలయ నిర్మాణం చేస్తే ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా భాసిల్లుతుందన్నారు. అలాగే పర్యాటకుల కోసం వారిలో ఆహ్లాదాన్ని నింపి విహార యాత్రగా మార్చే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో అటు పర్యాటకంగా, ఇటు ఆధ్యాత్మికంగా పవిత్ర సంగమం నిలుస్తుందని తెలిపారు. లంక భూములను కూడా అందుబాటులోకి తీసుకువస్తే ఈ ప్రాంతానికి మరింత శోభ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందన్నారు. భక్తులకు, పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో సైతం భక్తులకు ఇబ్బంది కలగకుండ అవసరమైనంత ప్లాట్ ఫాం ఎత్తు పెంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు.
ముందుగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ అధికారులు, ఇరిగేషన్, సీఆర్డీఏ, ఆర్ అండ్ బి, ట్రాన్స్ కో, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ప్రాధమికంగా అంచనా వేసిన పనులకు రూ. 88లక్షలకు పైగా నిధులు అవసరమని దీంతో పవిత్ర సంగమం వద్ద భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయవచ్చని అధికారులు మంత్రుల బృందానికి నివేదించారు. మంత్రుల బృందం హైవే నుండి ఘాట్ వరకు ఉన్న రహదారికి పూర్తి స్థాయిలో మరమత్తులు అవసరమని, అక్కడి నుండే లైటింగ్ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. నిధుల సమస్య లేకుండా చూస్తామని పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. నవ హారతుల సమయంలో భక్తుల్లో ఆధ్యాత్మిక భావం పెంపొందేలా వాఖ్యాత, భక్తి గీతాలు ఏర్పాటు చేయడం, విద్యుద్దీపాలంకరణలు చేయడం, పోలీసుల పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఉండేలా చూడాలని మంత్రుల బృందం ఆదేశాలు ఇచ్చారు.
కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, తిరువూరు ఆర్ డి ఓ మాధవి, దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమీషనర్ చంద్రశేఖర్ ఆజాద్ , శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంల ఈవో కెఎస్. రమారావు, ఇరిగేషన్ EE కృష్ణారావు, దేవస్థానం EE లు ఎల్. రమ, కోటేశ్వరరావు, కొండపల్లి మునిసిపల్ కమిషనర్ బి. రమ్యకీర్తన, డిసిపి వెస్ట్ హరికృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.