-పాలిటెక్నిక్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం
-ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కి ఘన సన్మానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే ఐదేళ్ల కాలంలో రాజధాని అమరావతితో పాటు విజయవాడ నగరాభివృద్ది జరుగుతుంది. విజయవాడ నగరానికి 2027లో నేషనల్ గేమ్స్ జరగబోతున్నట్లు ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ లో ఆదివారం పాలిటెక్నిక్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి పాల్గొన్నారు. అసోసియేషన్ సభ్యులు ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరాభివృద్దితో పాటు క్రీడాభివృద్ది కి కూడా కృషి చేయనున్నట్లు తెలిపారు. అమరావతికి ఓ గుర్తింపు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2027లో విజయవాడకి నేషనల్ గేమ్స్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందన్నారు. ఇక మంగళగిరిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ను ఆరునెలల్లో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. నగరంలో స్టేడియం నిర్మించేందుక స్థలం లేనందున క్రికెట్ అకాడెమి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే విజయవాడ మూడు నియోజకవర్గాల్లో అభివృద్ది జరిపిస్తామన్నారు. డ్రైనేజీ సమస్యలు, రోడ్ల సమస్యల పరిష్కారం , ఫ్లై ఓవర్స్ నిర్మాణంతో పాటు, రైల్వేస్టేషన్ లో ప్రయాణీకులకు వసతులు, కనకదుర్గ ఆలయంలో భక్తులకు మౌళిక సదుపాయాలు కల్పించే విధంగా అభివృద్ది పనులు ఈ ఐదేళ్లలో చేపడతామన్నారు.
అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల సమస్యను ఎంపి కేశినేని శివనాథ్ సహకారంతో త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఒక ప్రాజెక్ట్ తయారు చేయించి నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు. విజయవాడ నగర అభివృద్ది కోసం సీనియర్ సీటిజన్స్ సలహాలు, సూచనలు అందించాలని కోరారు.రాష్ట్రంలో ఎన్డీయే కూటమి గెలిచిన తర్వాత ప్రజలందరూ స్వేచ్ఛ లభించిందన్న ఆనందంతో రోడ్లపైకి వచ్చి ఉత్సవాలు జరుపుకున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరపనేని నాగేశ్వరరావు, సెక్రటరి గుత్తికొండ సతీష్ , ప్రిన్సిపాల్ విజయసారథి, హెచ్.ఎమ్. పి.శ్రీనివాసరావు, రిటైర్డ్ హెచ్.ఎమ్. వెంకారెడ్డి, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ చలసాని రమణ, సి.పి.ఎం లీడర్ బాబురావు,టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్, యేర్నెని వేదవ్యాస్, విష్ణు బిల్డర్స్ విష్ణు, కాటంరాజు, శ్రీనివాస్, రాజు, వాకర్స్ అసోసియేషన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.