-విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
-ముఖ్య అతిథిగా హాజరైన ఎంపి కేశినేని శివనాథ్
-రూ.25 లక్షలు అన్న క్యాంటీన్ కి ప్రకటించిన ఛాంబర్ సభ్యులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా వుండే విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆట బొమ్మలా మారింది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాంబర్ ఆప్ కామర్స్ సభ్యులందరూ ఒక మాట మీద నిలబడి ఎన్నికలు నిర్వహించుకోవటం, అధ్యక్షుడిగా గడ్డం బాల వెంకట రవి కుమార్ ను ఎన్నుకోవటం సంతోషం వుంది. మీరంతా ఐక్యంగా వుండి విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ కి పూర్వ వైభవం తీసుకురావాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం గాంధీనగర్ లో విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ అశోక్ బాబు తో కలిసి పాల్గొన్నారు. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన గడ్డం రవి కుమార్ ఎంపి కేశినేని శివనాథ్ సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచరించే మొదటి సూత్రంగా కూడా ఇదేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారస్తులకు అండగా వుంటుందన్నారు. వర్తక వాణిజ్య నగరమైన విజయవాడలోని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్రంలోని పలు అసోసియేషన్స్ కి దశాదిశ మార్గనిర్దేశం చేసేలా వుండాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ జిల్లాలోని అన్న క్యాంటీన్ల నిర్వహణ భారం ప్రభుత్వంపై పడకుండా దాతలు విరాళాలు ఇవ్వాలని కోరగానే, చాంబర్ ఆప్ కామర్స్ తరుఫున 25 లక్షల రూపాయలు ప్రకటించి అందజేస్తామన్న అసోసియేషన్ సభ్యులకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ సొంత నిధులతో వుండే విధంగా వృద్ది చేయాలని సభ్యులను కోరారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ అసోసియేషన్ తరుఫున మరిన్నీ స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించాలని, వాటికి తప్పకుండా తన సహకారం అందిస్తానని తెలిపారు.
విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడు గడ్డం రవి మాట్లాడుతూ ఎన్నికల్లో అందర్ని ఒక మాట మీదకి తెచ్చి ఎన్నికలు ఎకగ్రీవం కావటానికి కృషి చేసిన రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు డూండీ రాకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి విబేధాలు లేకుండా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో చాంబర్ ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడు సిద్దంగా వుంటుందని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వి.వి.కె నరసింహరావు, వైస్ ప్రెసిడెంట్ దర్శి శ్రీనివాసులు , జనరల్ సెక్రటరీ వక్కలగడ్డ శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ ఈమని దామోదరరావు, జాయింట్ డైరెక్టర్ బాలకిషన్ లోయ, కోశాధికారి తమ్మిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.