-ఈ నెల 19న శ్రీసిటీ నందు పలు పరిశ్రమలకు ముఖ్యమంత్రి భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లు
శ్రీసిటీ, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 19 న శ్రీసిటీలో పలు పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో శ్రీసిటీ లో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, పర్యటన ఏర్పాట్లపై అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీసిటీ సెజ్ నందు 8 పరిశ్రమలకు భూమి పూజ, 16 పరిశ్రమల ప్రారంభానికి, 5 పరిశ్రమలకు ఎంఓయులు చేపట్టనున్నారు అని తెలిపారు. ఈ సందర్భంగా హెలిపాడ్ నుండి పరిశ్రమలు ప్రారంభించు బిజినెస్ సెంటర్ వద్ద వరకు ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించి, హెలిప్యాడ్ ఏర్పాట్లు, అక్కడ షేడ్, భద్రత ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఉదయం ముఖ్యమంత్రి సోమవారం(నేడు) ఉదయం 11.30 గం లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుండి హెలికాప్టర్ లో 11.40 గం లకు బయలుదేరి శ్రీ సిటీ సమీపం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు ఉదయం 11.55 గం.ల కు చేరుకుంటారనీ, అక్కడి నుండి ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన శ్రీసిటీ లోని బిజినెస్ సెంటర్ కు మధ్యాహ్నం 12.10 గం.లకు చేరుకుని 2.30 గం. ల వరకు బిజినెస్ సెంటర్ నందు పలు పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేసి పలువురు పరిశ్రమల సిఈఓ లతో సమావేశంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2.40 గం. లకు శ్రీసిటీ హెలిప్యాడ్ నుండి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయం 2.55 గం.లకు చేరుకుని తిరుగు ప్రయాణం కానున్నారని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ సుబ్బరాయుడు, జెసి శుభం బన్సల్ శ్రీ సిటీలో జరుగుతున్న పలు ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి లు కులశేఖర్, రాజేంద్ర, ఆర్డీఓ కిరణ్ కుమార్, జోనల్ మేనేజర్ ఏపీఐఐసి చంద్ర శేఖర్,ఆర్ అండ్ బి ఎస్ ఈ మధుసూధన్ రావు, శ్రీసిటీ ప్రతినిధులు పీ. ముకుంద రెడ్డి రెసిడెంట్ డైరెక్టర్, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.