గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న వనరులతో మెరుగైన పారిశుధ్యాన్ని సాధించడానికి నగర ప్రజలతో పాటుగా కార్మిక సంఘాలు కూడా సహకరించి, పరిశుభ్రమైన గుంటూరు నగరం కోసం చేసే కృషిలో భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజారోగ్య విభాగంలో చేపట్టాల్సిన అంశాలపై వివిధ కార్మిక సంఘాల నాయకులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యం అందించేందుకు నగరపాలక సంస్థ నుండి అందుబాటులో ఉన్న వనరులను సమర్దవంతంగా వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. నగరంలో శానిటరీ డివిజన్ల వారీగా కార్మికులను రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక సంఘాల నాయకులు కూడా క్లీన్ గుంటూరుగా మార్చుకోవడంలో అంకిత భావంతో నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగంకు కేటాయించిన ఈ-ఆటోలు, పుష్ కాట్స్, ట్రాక్టర్లు వంటి వాటికి మరమత్తులు ఉంటే వెంటనే చేపడతామని తెలిపారు. కార్మికుల హాజరు వేసే మస్టర్ పాయింట్స్ కూడా కార్మికులకు అనుకూలంగా ఉండేలా మార్చడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఎంహెచ్ఓని ఆదేశించారు.
నగర ప్రజలు కూడా తమ ఇళ్లల్లో వచ్చే వ్యర్ధాలను రోడ్ల మీద, కాల్వల్లో వేయకుండా తమ ఇళ్ళ వద్దకు వచ్చే పుష్ కాట్ లేదా ఆటోకే వ్యర్ధాలను అందించాలన్నారు. సచివాలయం వారీగా ఏ ప్రాంతానికి ఏ సమయంలో ప్రజారోగ్య కార్మికులు చెత్త సేకరణకు వస్తారో ప్రజలకు ముందుగానే తెలియచేస్తామని తెలిపారు.
అనంతరం కార్మిక సంఘాల నాయకుల అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకొని, మస్టర్ పాయింట్స్ వద్ద మౌలిక వసతుల కల్పన, ఇతర సూచనలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.
సమావేశంలో అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, డి.వెంకట లక్ష్మీ, ఎంహెచ్ఓ మధుసూదన్, ఎస్.ఈ. శ్యాం సుందర్, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …