-అనధికార, ఫీజులు చెల్లించని హోర్డింగ్స్ ని తక్షణం తొలగించాలని ఆదేశం
-నగరంలో అనధికార హోర్డింగ్స్ తొలగింపు పై స్పెషల్ డ్రైవ్
-ఫుట్ పాత్ లు, రోడ్ల ఆక్రమణలు, ఫ్లెక్సిలు తొలగింపు
-వారం రోజుల యాక్షన్ ప్లాన్…నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ అనుమతితో నగరంలో ఏర్పాటు చేసిన ప్రతి ప్రకటన బోర్డ్ నిర్దేశిత మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజులు చెల్లించాలని, ఫీజులు చెల్లించని, అనుమతి లేని బోర్డ్ లను తొలగిస్తామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం పట్టణ ప్రణాళిక అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఫీజులు చెల్లించని, అనధికార హోర్డింగ్లు, బోర్డ్ లను, ఫ్లెక్సీలను తొలగించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్రకటనల హోర్డింగ్స్ యజమానులు మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజులు సక్రమంగా చెల్లించాలని, లేకుంటే సదరు బోర్డ్ లను తొలగించి, ఫీజుల వసూళ్లకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం నుండి నగరంలో పట్టణ ప్రణాళిక అధికారులు నగరంలో షుమారు 120కి పైగా అనధికార హోర్డింగ్ లను తొలగించారన్నారు. అనధికార బోర్డ్లు, హోర్డింగ్స్ నగరంలో ఉండడానికి వీలు లేదని, అటువంటి వాటిని వెంటనే తొలగించడానికి పట్టణ ప్రణాళిక అధికారులు స్పెషల్ టీంను అందుబాటులో ఉంచాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. నగరంలో వార్డ్ సచివాలయాల వారిగా ప్లానింగ్ కార్యదర్శులు అనధికార, ఫీజులు చెల్లించని బోర్డ్ లను గుర్తించి, వాటిని తొలగించాలన్నారు. పలు ప్రాంతాల్లో ఇష్టానుసారం ఫ్లేక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, వాటిని కూడా తొలగించాలన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్ల విస్తరణ చేస్తున్నామని, కొందరు రోడ్ల మీద వ్యాపారాలు చేస్తూ ట్రాఫిక్ కి అంతరాయం కల్గిస్తున్నారన్నారు. రోడ్, ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపులో రాజీపడకూడదన్నారు. పట్టణ ప్రణాళిక అధికారుల ద్వారా యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని, తమ క్షేత్ర స్థాయి పర్యటనలో ఎక్కడైనా అనధికార బోర్డ్ లు గుర్తిస్తే సంబందిత కార్యదర్శిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రకటనల బోర్డ్ ల నిర్వహకులు తప్పనిసరిగా బకాయిలతో పాటుగా ప్రస్తుత ఏడాది డిమాండ్ కూడా చెల్లించాలన్నారు.