-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
-ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.. తప్పకుండా చర్యలు ఉంటాయి: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి పారదర్శకంగా ఇసుక అందేలా ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టిందని, అక్రమ రవాణా ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మరియు ఎస్పీ సుబ్బరాయుడు సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మీడియా ప్రతినిధులతో కలెక్టర్ మరియు ఎస్పీ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి పారదర్శకంగా ఇసుక అందేలా ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టిందని, ఈ ఉచిత ఇసుక విధానంలో ఐదు డిపోలు ద్వారా లక్షా 16 వేల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజలు వినియోగించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం అడవికోడియంబెడు నందు 63000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిలో అక్రమాలు జరగకుండా, ఎంతో సేపు ఇసుక కొరకు వేచి ఉండే వారికి కాకుండా ఇతరులకు ఇస్తున్నారని, ఎక్కువ ధరకు ఇస్తున్నారని పలు కంప్లైంట్ల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ తదితర ఉన్నతాధికారులు సమీక్షించి పలు మార్గదర్శకాలు విడుదల చేశారని తెలిపారు. ఇక నుండి గుర్తించిన పది సచివాలయాల్లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని, అలాగే ఎలాంటి వాహనం అనేది, దాని నంబర్ నమోదుతో టైం స్లాట్ మేరకు స్లిప్ ఇవ్వడం జరుగుతుందని అక్కడే ఇసుక కమిటీ నిర్ణయించిన నామ మాత్రపు రుసుమును చెల్లించి, ఆ మేరకు మాత్రమే డిపోకు వెళ్లి ఇసుకను తీసుకుని వెళ్ళాలని తెలిపారు. ఇసుక కోసం రిజిష్టర్ చేసిన వాహనాలను మాత్రమే ఇసుక రీచ్ ల్లోకి అనుమతి ఉంటుందని, ఇతర వాహనాలను ఎంతమాత్రం అనుమతించబోమని, అలాగే ట్రాన్స్పోర్టేషన్ రేట్ కూడా ఫిక్స్ చేశామని, వాటి వివరాలు అన్ని సచివాలయాల్లో, తాసిల్దార్, ఎంపిడిఓ మరియు పోలీస్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రిజిస్టర్ చేసుకున్న వాహనం మాత్రమే తీసుకెళ్ళాల్సి ఉంటుంది. ఇసుక అక్రమ రవాణాను సెబ్, పోలీస్ అధికారులు కట్టడి చేస్తున్నారని, అక్రమాలకు తావు లేకుండా అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇసుకకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు ఉంటే జిల్లాలోని కంట్రోల్ రూం నంబర్ 08772999077 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే రాష్ట్ర టోల్ ఫ్రీ నంబర్ 18004256035 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల సెప్టెంబర్ 11 న తీసుకు రానున్నదని తెలిపారు. అలాగే రెండు వారాల్లో మన జిల్లాలో మరొక డీ సిల్టేషన్ పాయింట్ నాయుడుపేట మండలం, కలువకూరు గ్రామ సమీపంలో పాలిచెర్ల నందు ఒక లక్ష మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి రానుందని తెలిపారు.
ఎస్పీ మాట్లాడుతూ క్వాలిటీ, క్వాంటిటీ, ధర, సమయం అనేవి ముఖ్యమైన అంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ తెలిపిన విధంగా ముందుగానే సచివాలయంలో స్లాట్ నమోదు చేసుకుని, వాహనం వివరాలు నమోదుతో స్లిప్ లో తెలిపిన తేదీ సమయానికి మాత్రమే వాహనం తీసుకెళ్ళి ఇసుక తీసుకెళ్లాలి అని తెలిపారు. అక్రమ రవాణా జరగకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ ప్రెస్ మీట్ నందు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా గనుల శాఖ అధికారి ప్రకాష్ కుమార్, అదనపు ఎస్పీ లు రాజేంద్ర, వెంకట్రావ్ తదితర అధికారులు పాల్గొన్నారు.