-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం నేటితరానికి స్ఫూర్తిదాయకమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆ మహనీయుని 152వ జయంతిని పురస్కరించుకుని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శుక్రవారం ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ స్పూర్తితో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నాయకులు టంగుటూరి ప్రకాశం పంతులు అని గుర్తుచేశారు. దేశం కోసం న్యాయవాద వృత్తిని విడిచి, ఆర్జనను ప్రజలకు పంచిపెట్టిన ప్రకాశం స్ఫూర్తి ఈతరం యువతకు ఆదర్శనీయమన్నారు. వందేమాతరం, స్వదేశీ ఉద్యమ సమయాల్లో అనేక సభలకు ఆయన అధ్యక్షత వహించారని పేర్కొన్నారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న సమయంలో తెల్లదొరల తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలిచి, తన గుండెను చూపిన ధీశాలి అని కీర్తించారు. ఆయన ప్రారంభించిన స్వరాజ్య పత్రిక స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ఎంతో ఆదర్శనీయమన్నారు. 1952లో భారీ వరదలు వచ్చిన సమయంలో పార్లమెంటులో పోరాడి ప్రభుత్వ నిధులతో కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణానికి పూనుకున్నారన్నారు. 1954 న సీఎం హోదాలో బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో.. బ్యారేజీకి ఆయన పేరు పెట్టారని చెప్పారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రజల అకుంటిత ధైర్యసాహసాలకు, అసమాన త్యాగనిరతికి టంగుటూరి మారుపేరుగా నిలిచారని చెప్పారు. ప్రకాశం పంతులు ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.