-భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సాగిన ప్రదర్శన
-గూడూరులోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల వేదికగా ప్రదర్శనను తిలకించిన 50కి పైగా పాఠశాలల, కళాశాలలకు చెందిన 10 వేలకు పైగా విద్యార్థులు
-ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంతరిక్షంలో మోదీతో సెల్ఫీ
-చంద్రయాన్ విజయానికి గర్వించటంతో పాటు, భూమి మీద పర్యావరణాన్ని కాపాడుకోవాలని సందేశం
గూడూరు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గూడూరులో ఏర్పాటు చేసిన అంతరిక్ష విశేషాల చిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) మూడు రోజుల పాటు ఆసక్తికరంగా సాగింది. ఆగస్టు 23న గూడూరు శాసనసభ్యులు డా. పాశిం సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రదర్శనను గూడూరులోని 50కి పైగా పాఠశాలలు, కళాశాలలకు చెందిన 10వేల మందికి పైగా విద్యార్థులు తిలకించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా గూడూరులోని వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వించిన పోటీల్లో ప్రథమ, ద్వితియ, తృతియ స్థానాల్లో నిలచిన విద్యార్థులకు ప్రతిరోజు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అంతరిక్షంలో మోడీతో సెల్ఫీ కౌంటర్ విద్యార్థులను విశేషంగా ఆకర్షించింది. ప్రతి ఒక్కరూ సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపించారు. ప్రదర్శనలో భాగంగా ఐ.సి.డి.ఎస్, ఆరోగ్య, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ భారత ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన విశేషాలను పిల్లలకు తెలియజేశాయి. రెండోరోజు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అంతరిక్ష వారోత్సవాల అవగాహన ర్యాలీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. శాస్త్రవేత్తల ఛాయా చిత్రాలతో సాగిన ర్యాలీ భారతదేశ విజయాన్ని కళ్ళకు కట్టింది. గూడూరు శాసన సభ్యులు, మున్సిపల్ కమిషనర్ సహా కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు నిర్వాహకులను ప్రశంసించారు. విద్యార్థులకు శాస్త్రసాంకేతిక అంశాల పట్ల అవగాహన కల్పించే విధంగా ప్రదర్శనను ఏర్పాటు చేయటం పట్ల అభినందలు తెలియజేశారు.
పర్యావరణ పరిరక్షణ సందేశం
——————————————
చంద్రయాన్ -3 విజయం ప్రతి భారతీయుడు గర్వించవలసిన అంశమని, అదే సమయంలో భూమి మీద పర్యావరణాన్ని కూడా కాపాడుకోవలసిన అవసరం ఉందని కార్యక్రమానికి విచ్చేసిన వక్తలు అభిప్రాయపడ్డారు. అంతరిక్ష దినోత్సవ ప్రదర్శనలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “అమ్మ పేరిట ఒక మొక్క” సెల్ఫీ బూత్ మరో ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం చివరి రోజున కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ దిశగా పిలుపునిచ్చారు.
విద్యార్థులకు మరింత ప్రయోజనం – భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారి పరవస్తు నాగసాయి సూరి
—————————————–
భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, క్షేత్ర కార్యాలయం, నెల్లూరు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయటం జరిగింది. సైన్స్ అంటే విద్యార్థుల్లో ఉండే ఆసక్తి మరింత ప్రత్యేకమైనది. ఈ ప్రదర్శన వల్ల వారికి ఎన్నో సందేహాలు తీరాయి. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వారిలో మరింత అవగాహన పెంచుతుంది. ఈ స్ఫూర్తి వారి భవిష్యత్తుకు చక్కని బాటలు వేస్తుంది.
అంతరిక్ష విశేషాలు తెలుసుకున్నాం – కె. మౌనిక, విద్యార్థిని
——————————————
అంతరిక్ష విశేషాల చిత్ర ప్రదర్శన నన్నెంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా అంతరిక్షంలో మోదీతో సెల్ఫీ నాకెంతో నచ్చింది. అంతరిక్ష రంగంలో భారతదేశం సాధించిన విజయాలు, భవిష్యత్ ప్రణాళికలు… ఇలా అన్నింటి గురించి సమగ్రంగా తెలుసుకోగలిగాను. విద్యార్థులకు ఇదెంతో ప్రయోజనకరం.
పర్యావరణ ప్రాధాన్యత తెలుసుకున్నాం – జి. చందన, విద్యార్థిని
—————————————–
చంద్రమండలం మీద సాధించిన విజయానికి గర్వపడటంతో పాటు, మన పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న సందేశం నాకు ఎంతో నచ్చింది. ముఖ్యంగా అమ్మ పేరిట మొక్క కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ అవగాహన కల్పించటం ఆనందంగా ఉంది. నేను కూడా మొక్కలు నాటి సెల్ఫీని సామాజిక మాధ్యమాల్లో పంచుకుని మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాను.