-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లోకానికి జ్ఞానాన్ని పంచిన గీతాచార్యుడు అయిన శ్రీ కృష్ణుని జన్మదినోత్సవం సర్వ మానవాళికి పర్వదినమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కృష్ణాష్టమిని పురస్కరించుకొని నగర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. మహావిష్ణువు ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణపరమాత్మ స్వరూపమని.. దశావతారాలలో పరిపూర్ణమైనదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథినాడు ఆ మధుసూదనుడు జన్మించాడని తెలిపారు. ఆ గోకుల నందనుడు జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయమని వెల్లడించారు. శ్రీకృష్ణుడి జీవితం ఒక ధర్మశాస్త్రం అని.. సమస్త మానవాళిని సన్మార్గంలో నడిపే విధంగా ఆ పరమాత్ముడు అర్జునునికి గీతను బోధించాడని పేర్కొన్నారు. భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు భోదించిన సందేశాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ గుర్తుచేస్తుందన్నారు. కృష్ణతత్వం చదివిన వారికి నిజమైన ప్రేమతత్వం తెలుస్తుందని.. గీతాసారాన్ని మనసున నింపుకోగలిగితే జీవితం సంతోషమయం అవుతుందని తెలియజేశారు.