-నిధులు వృధా చేయకుండా సద్వినియోగ పరచండి.
-రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా . పి నారాయణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగరపాలక సంస్థ, తుడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రాదాన్యతా క్రమంలో పూర్తి చేయాలని, ఎక్కడా నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా.పీ. నారాయణ అధికారులకు సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థ, తుడాలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై తుడా సమావేశం మందిరంలో సోమవారం మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, చేపట్టనున్న పనులు, నిధుల పెండింగ్ తదితర అంశాలపైన, తుడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తుడా ఇంచార్జ్ వి సి. వెంకట నారాయణ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రి నారాయణ కు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. మనం అందరూ కూడా అభివృద్ధి బాట పట్టాలని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వఛ్చిన తరువాత అన్ని మున్సిపాలిటీ ల కమిషషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష లు నిర్వహించానని అన్నారు. ఇక నుండి ముఖ్యమైన మున్సిపాలిటీల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఏమి జరుగుతోంది, అభివృద్ధి ఎలా చేయాలనే అంశాలపై సమీక్షించనున్నానని అన్నారు. నిధుల కొరత ఉందని అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కేంద్రం నుండి నిధులు తెచ్ఛేందుకు అన్ని ప్రయత్నలు చేస్తున్నారని అన్నారు. త్వరలోనే నిధులు వస్తాయని అన్నారు. వఛ్చిన నిధులను చక్కగా ప్లాన్ చేసుకుని ప్రాధాన్యత క్రమంలో ప్రజా అభివృద్ధి పనులకు వెచ్చించాలని అన్నారు. మున్సిపాలిటీ లోని అన్ని విభాగాల అధికారులు చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్లాన్ చేసుకోవాలని అన్నారు.
తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ టిడిఆర్ బాండ్ల దుర్వినియోగం జరిగిందన్నారు. నగరంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని, శెట్టిపల్లి భూముల సమస్యను పరిష్కరించాలని, భూగర్భ డ్రైనేజి వ్యవస్థను పునరిద్దరించాలని, ఆటోనగర్ అభివృద్ధి చేయాలని, నగరంలో ప్రజలకు నీటి సమస్య రాకుండా చూడాలని కోరారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ తుడా ద్వారా నిధులు దుర్వినియోగం జరిగిందని విచారణ చేపట్టాలని కోరారు. పార్కుల నిర్వహణ పెంచాలని, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. నిధుల దుర్వినియోగం పై విచారణకు ఆదేశించామని, అభివృద్ధి పనులకు నిధులు ఇస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ, తుడా అధికారులు పాల్గొన్నారు.