గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వాటర్ ఎనాలసిస్ పెండింగ్ సర్వే యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో సర్వే నిర్వహణపై ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఆస్తి పన్నుకు, నీటి పన్ను అనుసంధానం వాటర్ ఎనాలసిస్ పెండింగ్ సర్వే వార్డ్ సచివాలయాల వారీగా ఆర్ఐలు, ఏఈలను వివరాలు అడిగి తెలుసుకొని, మిగిలి ఉన్న సర్వేని యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతి ఇంటికి నీటి కుళాయి అందించే లక్ష్యంగా ఇంటింటి సర్వే చేస్తున్నారని, నగరంలో ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి అందించడం నగరపాలక సంస్థ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. నగరపాలక సంస్థ రెవెన్యూ ఆర్ఐలు పరిపాలన కార్యదర్శుల ద్వారా ఆస్తి పన్ను లేని ఇళ్లను వార్డ్ ల వారీగా గుర్తించారన్నారు. ఇప్పటికీ 1790 మాత్రమే గుర్తించడం జరిగిందని, నగరంలో పన్ను లేని గృహాలను తమ క్షేత్ర స్థాయి పర్యటనలో గుర్తిస్తే సంబందిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పూర్తి స్థాయి సర్వే చేసి అన్ అసెస్మెంట్ ల వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
నగరంలో ఆస్తి పన్ను లేని గృహ యజమానులు మరియు ఆక్రమిత గృహాలు కల్గి, ఆస్తి పన్ను లేని వారు సమీప వార్డ్ సచివాలయంలో ఆస్తి పన్ను కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆస్తి పన్ను విధించిన వెంటనే త్రాగునీటి కుళాయి కూడా మంజూరు చేస్తామని తెలిపారు. నగరపాలక సంస్థ సంబందిత అంశంపై ప్రత్యేకంగా 15రోజులు డ్రైవ్ చేపడుతుందని తెలిపారు. ఇళ్లు ఉండి కుళాయి లేనివారు, ఇళ్లు ఉండి ఆస్తి పన్ను లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సమీక్షా సమావేశానికి ఆలస్యంగా హాజరు అయిన ఏఈ అనూష, డిఈఈ సతీష్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఈఈని ఆదేశించారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, ఈఈలు సుందర్రామిరెడ్డి, కొండారెడ్డి, శ్రీనివాస్, కోటేశ్వరరావు, డిఈఈలు, ఆర్ఓలు, ఏఈలు, ఆర్ఐలు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …