Breaking News

పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు తప్పకుండా పరిశ్రమల యాజమాన్యాలు అమలు చేయాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
-పరిశ్రమల్లో సెక్యూరిటీ ప్లాన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధంగా ఉండాలి: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు తప్పకుండా పరిశ్రమల యాజమాన్యాలు అమలు చేయాలని,పరిశ్రమల్లో సెక్యూరిటీ ప్లాన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు వివిధ హజర్డస్ పరిశ్రమల ప్రతినిధులతో, పరిశ్రమల శాఖ, పోలీస్ తదితర సంబంధిత శాఖలతో కలెక్టర్ మరియు ఎస్పీ సంయుక్త సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమలకు పెద్ద పీట వేస్తున్నారని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ మధ్యనే మన జిల్లాలో 3 మంది వేర్వేరు పరిశ్రమల్లో వివిధ కారణాల వలన ప్రమాదం బారిన పడి చనిపోవడం జరిగిందనీ, దురదృష్ట సంఘటన అని అన్నారు. పరిశ్రమల్లో ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భాల్లో ఆలస్యంగా జిల్లా యంత్రాంగానికి సమాచారం అందుతోంది అని, అలా కాకుండా సంఘటన జరిగిన వెంటనే సమాచారం అందిస్తే జిల్లా యంత్రాంగం నుండి తగు చర్యలు చేపట్టడం ద్వారా అపాయం తీవ్రత తగ్గే అవకాశాలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో 12 MAH-A (అత్యంత ప్రమాదకర) కేటగిరీలో, 107 MAH-B1 మరియు MAH-B2 కేటగిరీలో పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. పలు పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నందు గుర్తించి సూచించిన భద్రతా లోపాల మేరకు సంబంధిత పరిశ్రమలు సరిచేసుకుని భద్రత ప్రమాణాలు పక్కా గా అమలయ్యేలా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని అన్నారు. అలాగే పరిశ్రమల వద్ద సేఫ్టీ ఆడిట్ జరిగిందనీ ప్రస్ఫుటంగా కనిపించేలా తేదీ, సంవత్సరం వివరాలు ప్రదర్శించాలని అన్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వారి విధులకు సంబంధించి అలాగే ఉద్యోగ రీత్యా వారి పనిలో రిస్క్ అంశాలపై అవగాహన, శిక్షణ ఎప్పటికప్పుడు కల్పించాలని సూచించారు. పరిశ్రమలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద పీట వేస్తూ పారిశ్రామిక వేత్తలకు సహృద్భావ వాతావరణం కల్పిస్తూ వాటి విస్తరణకు చర్యలు చేపడుతున్నారని అన్నారు. పరిశ్రమల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగుల భద్రత కూడా అత్యంత ముఖ్యమని అన్నారు. పరిశ్రమల్లో క్వాలిఫైడ్, సర్టిఫైడ్,సేఫ్టీ ఆఫీసర్ లను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పరిశ్రమల్లో గత కొన్ని రోజుల కిందట జరిగిన ప్రమాద ఘటనలను ఇతర పరిశ్రమలతో షేర్ చేసుకోవడం ద్వారా అప్రమత్తం అయ్యేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్న అంశం స్వాగతించదగిందని అన్నారు. ప్రతి పరిశ్రమల్లో రెండు నెలలకు ఒకసారి తప్పకుండా ఫైర్ మాక్ డ్రిల్ చేయాలని, అలాగే ఒక మాక్ డ్రిల్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ పై ఆరు నెలలకు ఒకసారి జనవరి మరియు జూలై నెలలలో డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీలు వారి మార్గదర్శకాల మేరకు తప్పక నిర్వహించాలని సూచించారు. గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బిజినెస్ ఫ్రెండ్లీ, ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ గా అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన టెక్నికల్ నైపుణ్యం యువతకు అందుబాటులో ఉండేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.

ఎస్పీ మాట్లాడుతూ గత కొంత కాలంలో పలు పరిశ్రమల్లో జరిగిన ప్రమాద సంఘటనల నేపథ్యంలో పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు చేయాలని, అలాగే విపత్కర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ప్లాన్ సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఎంట్రీ, ఎగ్జిట్, హాస్పిటల్, ట్రాన్స్పోర్ట్ అంశాలు ప్రణాలికలు ఉండాలని సూచించారు. హజార్డస్ పరిశ్రమలు, వారి సెక్యూరిటీ ప్లాన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ బ్లూ ప్రింట్ రెవెన్యూ, పోలీస్ యంత్రాంగానికి అందుబాటులో ఉంచాలని, తద్వారా అపాయకర పరిస్థితుల్లో రెస్క్యూ కొరకు త్వరితగతిన చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరిస్ రామకృష్ణ రెడ్డి వివరిస్తూ.. దాదాపు అన్ని పరిశ్రమలు తనిఖీ చేశామని భద్రత ప్రమాణాలకు సంబంధించిన నోటీస్ లు పలు పరిశ్రమలకు ఇవ్వడం జరిగిందని, సదరు పరిశ్రమలు లోపాలు సరిచేసుకుని రిపోర్ట్ చేశారని తెలుపుతూ, పరిశ్రమలు తప్పకుండా భద్రత ప్రమాణాలు అమలులో ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. పరిశ్రమల్లో అందుబాటులో ఉన్న రెస్క్యూ పరికరాలు ఎప్పటికప్పుడు పనితీరు చెక్ చేసుకోవాలని, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు జిల్లా కేంద్రం నుండి రెస్క్యూ పరికరాలు వచ్చే లోపు, దానికి దగ్గరలోని పరిశ్రమలలోని సహాయక మెటీరియల్ అందుబాటులో ఉంటే వాటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సహకరించాలని తెలిపారు.

పిసిబి అధికారి మదనగోపాల్ మాట్లాడుతూ రియాక్టర్ లు, బాయిలర్ లు తదితరాలు అపాయకరమైన వాటిని, వాటి ప్రెషర్ వాల్వ్, సక్రమంగా వాటి లెవెల్స్ పై అవగాహన కలిగి ఉండి సక్రమంగా ఆపరేట్ చేయకుంటే అవి పేలడానికి అవకాశాలు ఉంటాయని తెలిపారు.

జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి రమణయ్య మాట్లాడుతూ పరిశ్రమల్లో అక్కడ యూనిట్లలో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందికి అక్కడ జరుగుతున్న ప్రాసెస్ పై అవగాహన కలిగి, టెక్నికల్ పారామీటర్ లపై అవగాహన కలిగి ఉండాలని, ఎగ్జీట్, ఎంట్రీలు, ఫైర్ ఫైటింగ్ పరికరాలు పనిచేసే స్థితిలో పక్కాగా ఉండాలని సూచించారు.

వరప్రసాద్ రావు బాయిలర్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ బాయిలర్ యూనిట్ల పరీక్షలు సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేస్తున్నామని తెలిపారు.

అమర్ రాజ కంపెనీ వారు అత్యాధునిక ఫైర్ ఫైటింగ్ యూనిట్లు త్వరలోనే రెండు నెలల్లో అందుబాటులో రానున్నాయని, ఇతర పరిశ్రమల్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వారి అగ్నిమాపక పరికరాలను వాడడానికి అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సందర్బంగా వారిని కలెక్టర్ అభినందించారు.

పలు పరిశ్రమల ప్రతినిధులు మాట్లాడుతూ వారు ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. అలాగే కొన్ని పరిశ్రమలకు అప్రోచ్ రహదారులు సరిగాలేవని, మంచి రహదారి కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని కోరారు. పరిశ్రమల ప్రోత్సాహకాలు అందేలా చూడాలని కోరారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, జిల్లా పరిశ్రమల శాఖ ఇంఛార్జి అధికారి రామ్మూర్తి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణ రెడ్డి, జోనల్ మేనేజర్ ఏపీఐఐసి చంద్ర శేఖర్, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ మదన్ మోహన్, పలు పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *