Breaking News

క్రీడల్లో రాణించాలంటే కఠోర శ్రమ, అంకితభావం అవసరం .. జిల్లా కలెక్టర్

-అవనిగడ్డలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడల్లో రాణించేందుకు కఠోర శ్రమ, అంకితభావం ఎంతో అవసరమని, ఆ దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు సూచించారు. భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా గురువారం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ రోజున జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. దేశ స్వాతంత్ర్యానికి మునుపే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ధ్యాన్ చంద్ హాకీ క్రీడలో రాణించి దేశానికి గొప్ప గుర్తింపును తెచ్చారని కొనియాడారు. అయితే కాలక్రమంలో అలాంటి పూర్వ వైభవం కనుమరుగవటం బాధాకరంశంగా పేర్కొన్నారు.

భారత క్రీడారంగంలో అంతర్జాతీయ స్థాయి క్రీడలు ఒలంపిక్స్ లో దేశం తరఫున పతకాలు సాధించటం అరుదుగా జరుగుతూ ఉండేదన్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనించినప్పుడు దేశానికి పూర్వ వైభవం వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

1996 ఒలంపిక్స్ లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించిన తరువాత, 2019లో 8 పతకాలు, ఇటీవల దాదాపు 6 క్రీడా పతకాలు సాధించడం గొప్ప శుభ పరిణామం అన్నారు.

తెలుగు ప్రాంత క్రీడాకారులు కరణం మల్లేశ్వరి, పీవీ సింధు, సైనా నెహ్వాల్ వంటి ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి దేశానికి గొప్ప పేరు తీసుకొచ్చారని ప్రశంసించారు.

ప్రస్తుత తరం క్రీడల్లో రాణించేందుకు వారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థి స్థాయి నుంచే ఆసక్తిని కొనసాగించాలని, చదువుతోపాటు క్రీడల్లో రాణించేందుకు కఠోర శ్రమ, అంకితభావం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.

క్రీడల్లో గెలుపోటములు సహజమని, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే విజయం సాధించగలమన్నారు. భారతదేశంలో క్రీడలకు గొప్ప భవిష్యత్తు ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులకు ఎంత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయని, దీన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యాయామ క్రీడాకారులు ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి వారిని ప్రోత్సహించి ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు.

అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ దివిసీమ అన్ని రంగాలలో అగ్రగామిగా కొనసాగుతుందన్నారు. గతంలో దివిసీమ నుంచి ఇద్దరు క్రీడాకారులు ఒలంపిక్స్ లో పాల్గొని తమ ప్రతిభను చాటారని కొనియాడారు. వెయిట్ లిఫ్టింగ్ లో కామినేని ఈశ్వరరావు 12 సార్లు ఛాంపియన్షిప్ సాధించారన్నారు. జంబలపూడి పిచ్చయ్య బ్యాడ్మింటన్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో రాణించారని, వారిరువురిని భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించిందన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులు ఈ దివిసీమలో జన్మించడం మనకెంతో గర్వకారణమని, నేటి తరం వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాగాయలంకలో జల క్రీడా కేంద్రాన్ని మంజూరు చేశారని, అక్కడ శిక్షణ పొందిన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించారని తెలిపారు. అయితే అప్పట్లో అసంపూర్తిగా నిలిచిపోయిన భవన నిర్మాణానికి ఇప్పుడు జిల్లా కలెక్టర్ చొరవ చూపటం అభినందించదగ్గ విషయం అని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన అనంతరం క్రీడా శిక్షణ సంస్థలన్నీ ఎన్టీఆర్ జిల్లాలోనే ఉండిపోయాయని, కృష్ణాజిల్లాకు సంబంధించిన క్రీడా శిక్షణ సంస్థలను జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు ఈ సందర్భంగా కలెక్టర్ ను కోరారు.

ప్రధాన ఆకర్షణగా నిలిచిన జాతీయ జెండా ఆవిష్కరణ..

కార్యక్రమంలో భాగంగా కళాశాల క్రీడా మైదానంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ ఆవిష్కరించిన 30 అడుగుల జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారు జాతీయ జెండాను నలువైపులా చేతబట్టి ప్రదర్శనగా సభా వేదిక నుండి క్రీడా మైదానం మధ్యకు తీసుకువెళ్లి ఆవిష్కరించారు. అనంతరం వారు క్రీడాజ్యోతి వెలిగించి ర్యాలీ ప్రదర్శన కోసం క్రీడాకారులకు అప్పగించారు.

అనంతరం క్రీడాకారులు, విద్యార్థులు క్రీడాజ్యోతి, జాతీయ జెండాలతో ప్రధాన రహదారుల గుండా ప్రదర్శనగా ర్యాలీ చేశారు.

ఈ కార్యక్రమంలో బందరు ఆర్డీవో ఎం వాణి, ఎంపీపీ సుమతీ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిణి ఝాన్సీ లక్ష్మి, విద్యాశాఖ అధికారిణి తాహెరా సుల్తానా, జిల్లా ప్రజా రవాణా అధికారిణి వాణిశ్రీ, ఎంపీడీవో మరియకుమారి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఉమారాణి, ప్రధానోపాధ్యాయులు గోపాల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *